Union Budget | భరోసా లేని బడ్జెట్.. అన్నిరంగాలకూ అసంతృప్తి మిగిల్చిన నిర్మల పద్దు
Union Budget | కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు గతంతో పోల్చితే ఈసారి లెక్క పెరిగినా.. కీలక రంగాలకు మాత్రం మొండి చెయ్యే దక్కింది.
Union Budget | కేంద్ర బడ్జెట్.. కాకి లెక్కలతోనే సరిపోయింది. రూ.53.47 లక్షల కోట్లతో వచ్చినా ఏ రంగాన్నీ సంతృప్తిపర్చకుండానే మోదీ సర్కార్ ముగించేసింది. ఆదాయ పన్ను జోలికే వెళ్లకుండా వేతన జీవులను నిరాశపర్చిన నిర్మలమ్మ.. పొదుపు-మదుపుల ఊసే ఎత్తకపోవడం గమనార్హం. ఓవైపు ఆహారం, ఎరువులు, ఇంధన రాయితీలకు కోతలు.. మరోవైపు స్టాక్ మార్కెట్లను కుదేలు చేసేలా సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ వాతలతో లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగం సాగింది మరి. 90 నిమిషాలపాటు మాట్లాడినా పెద్దగా ఆకట్టుకునే ఒక్క ప్రకటన కూడా లేకపోవడంతో అన్ని వర్గాలనూ ఊరించి ఉసూరుమనిపించినట్టే అయ్యింది.
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 1: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వార్షిక బడ్జెట్ ఊరించి ఉసూరుమనిపించింది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2026-27)గాను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం పార్లమెంట్లో పద్దును ప్రవేశపెట్టారు. ‘పేరు గొప్ప.. ఊరు దిబ్బ’ అన్నట్టు గతంతో పోల్చితే ఈసారి లెక్క పెరిగినా.. కీలక రంగాలకు మాత్రం మొండి చెయ్యే దక్కింది. ఏకంగా రూ.53.47 లక్షల కోట్లతో ఈసారి బడ్జెట్‌ను ప్రకటించారు. అయినప్పటికీ ఏ రంగాన్నీ సంతృప్తిపర్చకుండానే ముగించారు.
ఉద్యోగులకు లేని ఐటీ ఊరట
ఈసారి బడ్జెట్ ఉద్యోగుల్ని విస్మరించింది. వ్యక్తిగత ఆదాయ పన్ను (ఐటీ) విధానాల్లో ఎలాంటి మార్పుల్నీ చేసేందుకు మోదీ సర్కార్ సిద్ధపడలేదు. నిజానికి స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పెంచాలన్న డిమాండ్లు గట్టిగా వినిపించాయి. ప్రస్తుతం ఇది రూ.75,000గానే ఉన్నది. అలాగే కొత్త పన్ను విధానంలో రూ.24 లక్షల వార్షికాదాయం దాటితే పడుతున్న 30 శాతం పన్నును రూ.30 లక్షలు దాటితేనే వర్తింపజేయాలన్న డిమాండ్లూ వచ్చాయి. 25 శాతం స్లాబును రూ.30 లక్షలకు పొడిగించాలని అంతా కోరారు మరి. అయినప్పటికీ కేంద్రం పట్టించుకోలేదు. ఇక పొదుపు-మదుపులకు పెద్దపీట వేసేలా ఉండే పాత ఆదాయ పన్ను విధానాన్నీ సవరించాలని, ఆకర్షణీయంగా తీర్చిదిద్దాలని ఉద్యోగులు, ఆర్థిక నిపుణులు మొత్తుకున్నా వినలేదు. దాంతో ఎప్పట్లాగే ఓల్డ్ ట్యాక్స్ విధానం ఈసారీ ఎక్కడిదక్కడే ఉండిపోయింది.
డెరివేటివ్స్‌కు ఎస్టీటీ దెబ్బ
ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్‌పై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ను పెంచుతున్నట్టు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ప్రకటించారు. డెరివేటివ్లలోగల ఊహాజనిత ట్రేడింగ్ వల్ల చిన్న మదుపరుల ప్రయోజనాలు దెబ్బతింటున్నాయని, అందుకే వారిని నిరుత్సాహపర్చడానికే ఈ పెంపు అని మంత్రి తెలిపారు. ఈ క్రమంలోనే ఫ్యూచర్స్ కాంట్రాక్ట్స్‌పై ఎస్టీటీని 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు. అలాగే ఆప్షన్స్ ప్రీమియం, ఎక్సైజ్ ఆప్షన్స్ రెండింటిపైనా 0.15 శాతానికి పెంచుతున్నట్టు తెలిపారు. ప్రస్తుతం ఇవి వరుసగా 0.1 శాతంగా, 0.125 శాతంగా ఉన్నాయి.
బైబ్యాక్లపై పన్ను
వాటాదారులు జరిపే బైబ్యాక్ షేర్ల ప్రక్రియను క్యాపిటల్ గెయిన్స్‌గానే పరిగణించడం జరుగుతుందని, వీటికి పన్నులు వర్తిస్తాయని బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. దీంతో బైబ్యాక్ ప్రోగ్రామ్‌లకు ఇక బ్రేకులు పడుతాయన్న అభిప్రాయాలైతే వినిపిస్తున్నాయి. దీనివల్ల ఈక్విటీ మార్కెట్లలోని ప్రమోటర్లు, పెట్టుబడులు పెడుతున్న మదుపరులకు నిరాశేనని అంటున్నారు. కాగా, కార్పొరేట్ ప్రమోటర్లకు 22 శాతం, నాన్-కార్పొరేట్ ప్రమోటర్లకు 30 శాతం పన్నులుంటాయి. డెరివేటివ్‌లపై ఎస్టీటీ 150 శాతం, 50 శాతం చొప్పున పెంపు నేపథ్యంలో ఈ నిర్ణయం ఇన్వెస్టర్లపై ఒత్తిడిని పెంచవచ్చంటున్నారు.
డిజిన్వెస్ట్‌మెంట్ లక్ష్యం 80 వేల కోట్లు
ప్రస్తుతేడాది నిర్దేశించుకున్న రూ.40 వేల కోట్లతో పోలిస్తే రెండింతలు పెంచింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించుకున్న రూ.40 వేల కోట్లలో కేవలం రూ.8 వేల కోట్లు మాత్రమే సేకరించింది. మరో రెండు నెలల మాత్రమే మిగిలివున్నప్పటికీ లక్ష్యానికి చేరుకునే అవకాశాలు కనిపించడం లేదు. పీఎస్‌యూ బ్యాంక్‌లో వాటా విక్రయానికి ముందుకొచ్చినప్పటికీ ఎన్నో అవాంతరాలు తలెత్తడంతో వెనక్కి తగ్గింది. మరోవైపు, ప్రభుత్వరంగ సంస్థల ఆస్తుల నగదీకరణకు శ్రీకారం చుట్టింది. ప్రభుత్వరంగ బ్యాంకులైన సెంట్రల్ బ్యాంక్, యూకో, పీఎన్బీ, బ్యాంక్ ఆఫ్ మహరాష్ట్ర, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌ల్లో వాటా విక్రయించడానికి కూడా పావులు కదుపుతున్నది.
వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ మోదీ సర్కార్ భారీ స్థాయిలో వాటాలను విక్రయించబోతున్నది. ప్రభుత్వరంగ సంస్థలను వదిలించుకోవడం లేదా వాటాల విక్రయం, ఆస్తుల నగదీకరణ ద్వారా గరిష్ఠంగా రూ.80 వేల కోట్ల వరకు నిధులను సమీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నది. 2026-27లో ఐడీబీఐ బ్యాంక్‌తోపాటు షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, పలు పీఎస్‌యూల్లో వాటాలను విక్రయించబోతున్నది.

విదేశీ సంస్థల డాటా సెంటర్లపై ట్యాక్స్ హాలిడే
విదేశీ సంస్థలకు రాచబాటవేసింది సార్వత్రిక బడ్జెట్. దేశవ్యాప్తంగా క్లౌడ్ సర్వీసుల కోసం వినియోగించే డాటా సెంటర్లను ఏర్పాటు చేసే విదేశీ సంస్థలకు 2047 వరకు ట్యాక్స్ హాలిడే ప్రకటించింది మోదీ సర్కార్. కీలక మౌలిక సదుపాయాలు కల్పించడం, డాటా సెంటర్లలో పెట్టుబడులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఈ డాటా సెంటర్ల ద్వారా దేశీయ, అంతర్జాతీయ కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుందని తెలిపింది.
బడ్జెట్ ప్రతికూలతలివే..
బడ్జెట్లో మౌలిక రంగానికి పెద్దపీట వేశామని, మూలధన వ్యయాన్ని పెంచామని, దీర్ఘకాలిక వృద్ధిరేటును లక్ష్యంగా పెట్టుకున్నామని ప్రభుత్వ పెద్దలు గొప్పలు చెప్తున్నారు. కానీ సామాన్యులకు ఊరటనిచ్చే అంశాలే లేవని, ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లకూ పరిష్కారం చూపలేదని, మదుపరుల సెంటిమెంట్‌నూ దెబ్బతీశారని మార్కెట్ నిపుణులు, ప్రతిపక్షాలు, ఆర్థిక విశ్లేషకులు అంటున్నారు.
ఈ నేపథ్యంలో ఈ పద్దులోని ప్రతికూలతల్ని పరిశీలిస్తే..
- అంచనాలను అందుకోలేకపోయారన్న వాదనలున్నాయి. దీన్నో నిస్తేజ బడ్జెట్‌గా విమర్శకులు అభివర్ణిస్తున్నారు.
- స్టాక్ మార్కెట్లు ఈ బడ్జెట్‌ను మెచ్చలేదు. సెన్సెక్స్, నిఫ్టీ బడ్జెట్ రోజున ఎప్పుడూ లేనంతగా క్షీణించాయి. అధిక పన్నులు మదుపరుల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి.
- డెరివేటివ్‌లపై సెక్యూరిటీస్ ట్రాన్జాక్షన్ ట్యాక్స్‌లో పెంపు చిన్న మదుపరులను, ట్రేడర్లను నిరుత్సాహపరుస్తున్నది. కఠిన ట్యాక్స్ పెనాల్టీలు, సావరిన్ గోల్డ్ బాండ్ల వంటి సాధనాలు భారమయ్యాయి.
- వ్యక్తిగత ఆదాయ పన్ను స్లాబుల్లో ఎలాంటి మార్పూ లేదు. పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి ఆదాయ వర్గాలకు ఊరటనివ్వలేదు.
- నెమ్మదించిన ప్రైవేట్ పెట్టుబడులు, వాణిజ్య లోటు ఒత్తిళ్లు, నిరుద్యోగం, ఆర్థిక క్రమశిక్షణ కొరవడటం వంటి కీలక స్థూల ఆర్థిక లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
- నిధుల కేటాయింపుల్లో పారదర్శకత లోపించడం, స్పష్టత లేమి బడ్జెట్ లక్ష్యాలపట్ల అపనమ్మకానికి దారి తీస్తున్నది. ఆరోగ్య, విద్య, సంక్షేమం తదితర రంగాలకు దక్కింది అంతంతే.
- కేంద్ర పన్నుల్లో రాష్ర్టాల వాటాను యథాతథంగానే ఉంచారు. పెరుగుతున్న ఖర్చులకు తగ్గట్టుగా రాష్ట్ర ప్రభుత్వాలకు అందాల్సిన అదనపు నిధులు పరిమితమే.
- తక్షణం పరిష్కరించాల్సిన నిరుద్యోగం, ఆదాయాల్లో అసమానతలు, ద్రవ్యోల్బణం, రైతులు లేదా చిరు వ్యాపారులకు మద్దతు వంటి కీలక అంశాలను విస్మరించారు.
ఏప్రిల్ నుంచి కొత్త ఐటీ చట్టం
వచ్చే ఆర్థిక సంవత్సరం (2026-27) మొదలు (ఏప్రిల్ 1 నుంచి) కొత్త ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-2025 అమల్లోకి రాబోతున్నది. త్వరలోనే నిబంధనలు, ట్యాక్స్ రిటర్న్స్ ఫారాలను తెస్తామని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో స్పష్టం చేశారు. 60 ఏండ్ల కిందటి పాత పన్ను విధానం స్థానంలో ఈ కొత్త ఐటీ విధానాన్ని పలు మార్పులు చేసి తెస్తున్న సంగతి విదితమే. ఇదిలావుంటే నామమాత్రపు రుసుము చెల్లింపుతో సవరించిన ఆదాయ పన్ను రిటర్న్స్ (ఐటీఆర్) దాఖలుకున్న గడువు డిసెంబర్ 31 నుంచి మార్చి 31దాకా పొడిగించారు.
ముఖ్యాంశాలు
- దేశ జీడీపీలో ప్రభుత్వ రుణాలను 55.6 శాతానికి కట్టడి చేయాలని లక్ష్యం
- కొత్త పన్ను విధానంలోనే ఇంటర్-కోఆపరేటివ్ సొసైటీల డివిడెండ్ ఆదాయంపై మినహాయింపులు
- అంచనా ప్రాతిపదికన పన్నులు చెల్లించే నాన్-రెసిడెంట్స్ కోసం కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్) మినహాయింపు
- నాన్-రెసిడెంట్స్ నుంచి స్థిరాస్తులు కొన్న వ్యక్తులు పన్ను మినహాయింపు కోసం ట్యాన్ వివరాలను పేర్కొనక్కర్లేదు.
- భారత్‌లోని తోలు లేదా సింథటిక్ ఫుట్‌వేర్, ప్రాసెస్డ్ సీఫుడ్ ఎగుమతిదారుల కోసం వారు దిగుమతి చేసుకునే నిర్దిష్ట ముడి సరుకులు, ఉత్పత్తులపై సుంకాల్లేవు
- బ్యాటరీ స్టోరేజీ కోసం లిథియం ఐయాన్ సెల్స్ తయారీకి వినియోగించే క్యాపిటల్ గూడ్స్‌పై పన్ను మినహాయింపు పొడిగింపు
- మద్యం, తుక్కు, ఖనిజాలపై టీసీఎస్ 2%
- లిబరలైజ్డ్ రెమిటెన్స్ స్కీమ్ కింద విద్య, వైద్య విద్యను అభ్యసిస్తున్నవారికి టీసీఎస్ రేటు 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గింపు
- విదేశీ టూర్ ప్యాకేజీల అమ్మకంపై టీసీఎస్ 5 శాతం నుంచి 2 శాతానికి కుదింపు
- ఎంఎస్ఎంఈలకు మద్దతుగా రూ.4,000 కోట్లతో ఆత్మనిర్భర్ భారత్ నిధి. దేశంలోని 2,3 శ్రేణి నగరాలు, పట్టణాల్లో ‘కార్పొరేట్ మిత్రాల’ కేడర్ అభివృద్ధి
- మున్సిపల్ కార్పొరేషన్ల సింగిల్ బాండ్ జారీకి రూ.100 కోట్ల ప్రోత్సాహకాలు
- ఉక్కు, సిమెంట్ తదితర రంగాల కోసం రూ.20,000 కోట్ల కార్బన్ క్యాప్చర్, యుటిలైజేషన్ స్కీం
- డెడికేటెడ్ రీట్స్ ద్వారా సీపీఎస్ఈల రియల్ ఎస్టేట్ ఆస్తుల నగదీకరణ
- పోర్ట్‌ఫోలియో ఇన్వెస్ట్మెంట్ స్కీం ద్వారా దేశీయ స్టాక్స్‌లో ఎన్నారై పెట్టుబడులు
- సీప్లేన్ల కోసం వయబిలిటీ గ్యాప్ ఫండింగ్. పౌర, శిక్షణ, ఇతర ఎయిర్‌క్రాఫ్ట్‌ల విడిభాగాలపై కనీస కస్టమ్స్ సుంకం లేదు
- బొగ్గు, లిగ్నైట్ అమ్మకాలపై టీసీఎస్ 2%
- బ్యాంకింగ్‌పై ఉన్నతస్థాయి కమిటీ
- ఐటీఆర్‌లలో విదేశీ ఆస్తులు, ఆదాయం పేర్కొనకుండా తప్పించుకుంటున్న విద్యార్థులు, యువ నిపుణులు, టెక్ ఎంప్లాయీస్ వంటి చిన్నతరహా పన్ను చెల్లింపుదారులు, రీలొకేటెడ్ ఎన్నారైలకు ఊరట.
- సిటీ ఎకనామిక్ రీజియన్లకు 5వేల కోట్లు
- ఆర్బీఐ, బ్యాంకుల నుంచి రూ.3.16 లక్షల కోట్ల డివిడెండ్లు రావచ్చని అంచనా
2026-27కుగాను రూ.53.47 లక్షల కోట్ల బడ్జెట్‌ను ప్రకటించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్
బడ్జెట్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. కానీ ఆశించిన స్థాయిలో లేదు. భవిష్యత్తుపై ఈ పద్దుతో మాకున్న భయాలు మరింత పెరిగాయి.- భారతీయ ఆంత్రప్రెన్యూర్స్సంఘం
73,990 కోట్లు కేంద్ర బడ్జెట్లో టెలికాం రంగానికి కేటాయించిన నిధులివి. నిరుడుతో పోల్చితే ఈసారి 38 శాతం పెరిగాయి. ఇక ఈ ఏడాది ప్రభుత్వ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్కు రూ.28,473 కోట్లు దక్కాయి.
బయోలాజిక్స్, బయోసిమిలర్స్ విభాగంలో భారత్ అగ్రగామి దేశాల సరసన నిలిచేందుకు ఉన్న అవకాశాలు అందిపుచ్చుకోవడానికి బడ్జెట్లో కీలక ప్రతిపాదనలు చేశారు. బయోఫార్మా శక్తి పథకానికి రూ.10 వేల కోట్ల నిధులను వెచ్చించడంతో దేశాన్ని నాణ్యమైన ఔషధాల ప్రపంచ సరఫరాదారు స్థాయి నుంచి గ్లోబల్ ఆవిష్కర్తలుగా మారడానికి సహాయం చేయనున్నది. – సతీశ్ రెడ్డి, డాక్టర్ రెడ్డీస్ చైర్మన్
12.22 లక్షల కోట్లు రాబోయే ఆర్థిక సంవత్సరం
మూలధన వ్యయ లక్ష్యం 4.3% ద్రవ్యలోటు అంచనా
రూపాయి రాక
- కార్పొరేషన్ ట్యాక్స్ 18%
- ఆదాయ పన్ను 21%
- కస్టమ్స్ 4%
- కేంద్ర ఎక్సైజ్ సుంకాలు 6%
- జీఎస్టీ, ఇతర పన్నులు 15%
- పన్నేతర ఆదాయం 10%
- రుణేతర ఆదాయం 2%
- అప్పులు, ఇతర మార్గాలు 24%
రూపాయి పోక
- పన్నుల రూపంలో రాష్ర్టాలకు 22%
- ఆర్థిక కమిషన్, ఇతర బదిలీలు 7%
- కేంద్ర ప్రాయోజిత పథకాల కోసం 8%
- వడ్డీల చెల్లింపులు 20%
- రక్షణ 11%
- సబ్సిడీల కోసం 6%
- కేంద్ర పథకాల కోసం 17%
- పెన్షన్ల కోసం 2%
- ఇతర ఖర్చులు 7%
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tushar Gandhi | నిరసనలో పాల్గొనేందుకు వెళ్తుండగా మహాత్మాగాంధీ మునిమనువడు అరెస్ట్..!
Dhruv Rathee | సీజేపీ నిరసనకు వెళ్లకుండా యూట్యూబర్ ధృవ్ రాఠీని అదుపులోకి తీసుకున్న ఢిల్లీ పోలీసులు
Vitamin D | ఎముకలే కాదు, గుండె ఆరోగ్యాన్ని సైతం కాపాడే విటమిన్ డి.. అధ్యయనంలో వెల్లడి..
Gold Locket | శ్రీవారికి బంగారు లాకెట్, ముత్యాలహారం విరాళం
Grammys 2027 | గ్రామీ బరిలో ‘ధురంధర్’ సౌండ్‌ట్రాక్.. ఏకంగా ఎనిమిది కేటగిరీల్లో ఎంట్రీలు!
ట్రెండింగ్ వార్తలు
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?

