న్యూఢిల్లీ, నవంబర్ 30: ఉద్యోగుల భవిష్యనిధి ఫండ్ ఈపీఎఫ్‌వో కీలక నిర్ణయాలు తీసుకున్నది. ఈపీఎఫ్‌వో చందాదారుడికి ఆర్థిక ప్రయోజనాలు కల్పించడానికి రూపొందించిన ఆమ్నెస్టీ స్కీంకు ఈపీఎఫ్‌వో పచ్చజెండా ఊపింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ అధ్యక్షతన ఢిల్లీలో జరిగిన సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీ సమావేశమై ఈ నిర్ణయం తీసుకున్నది. ఈపీఎఫ్‌వో సెటిల్మెంట్ సమయంలో చేసే వడ్డీ చెల్లింపులను ఇకపై క్లెయిమ్ సెటిల్మెంట్ తేది వరకు చెల్లించాలని నిర్ణయించింది.
ప్రస్తుత నిబంధనల ప్రకారం సెటిల్మెంట్ సమయంలో ఆ నెల 24వ తేదీ వరకు మాత్రమే వడ్డీ లెక్కించే విధానం ఉండగా.. ఇకపై సెటిల్మెంట్ తేదీ వరకు వడ్డీ చెల్లించనున్నారు. దీనివల్ల ఆర్థికంగా చందాదారుడికి ప్రయోజనం కలగడంతోపాటు ఫిర్యాదుల తగ్గుతాయని సీబీడీటీ అభిప్రాయపడింది. దీంతోపాటు ఈ స్కీం ప్రయోజనాలు పొందేందుకు యజమానులు నుంచి ఒక సాధారణ ఆన్లైన్ డిక్లరేషన్ సర్టిఫికేట్ తీసుకుంటే సరిపొతున్నదని తెలిపింది. దీంతోపాటు ఆర్థిక భారం నుంచి తప్పించుకోవడానికి ఉద్యోగ భవిష్యనిధి సంస్థతో రిజిస్టర్ కాకపోయిన ఉద్యోగుల నిధులను డిపాజిట్ చేయకుండా ఎగవేతలకు పాల్పడే సంస్థలకు క్షమాభిక్ష ప్రసాదించాలని నిర్ణయించింది.
ఆయా సంస్థలు ఎలాంటి పెనాల్టీ ఎదుర్కొకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చి వివరాలు వెల్లడించే అవకాశాన్ని కల్పించింది. మరోవైపు, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికిగాను ప్రవేశపెట్టిన సార్వత్రిక బడ్జెట్లో ప్రకటించిన ఎంప్లాయి డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్ స్కీంనకు ఈ పథకం సహాయపడనున్నది. అలాగే ఎంప్లాయిస్ డిపాజిట్ లింక్డ్ ఇన్సూరెన్స్(ఈడీఎల్ఐ) స్కీంకు బోర్డు ఆమోదం తెలిపింది. ఈ స్కీం కింద చందాదారుడు మరణిస్తే రూ.2.5 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు బీమా పరిహారం లభించనున్నది.
మళ్లీ ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడానికి ఈపీఎప్‌వో బాడీ అనుమతినిచ్చింది. గతంలో ఈక్విటీలో పెట్టుబడులను తిరిగి ఈక్విటీల్లో పెట్టుబడి ప్రతిపాదనలకు బోర్డు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. కనీసంగా ఐదేండ్లపాటు ఈ పెట్టుబడులు అలాగే ఉండాలని, ప్రభుత్వ సెక్యూరిటీలు, సీపీఎస్ఈ, భారత్ 22లో పెట్టనున్నది. ఆటో క్లెయిం సెటిల్మెంట్ సదుపాయాన్ని రూ.50 వేల నుంచి లక్ష రూపాయల వరకు పెంచింది. గృహాలు, వివాహాం, విద్యకు సంబంధించి రుణాలు తీసుకునేవారికి ఇది వర్తించనున్నది.