ల్యాప్‌టాప్, కంప్యూటర్ల దిగుమతులపై ఆంక్షలు.. భద్రతా కారణాలను చూపుతూ నిర్ణయం
ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే దేశీయంగా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, ఆయా రకాల కంప్యూటర్ల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయమని మోదీ సర్కారు చెప్పుకుంటున్నా..
న్యూఢిల్లీ, ఆగస్టు 3: ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కొన్ని రకాల కంప్యూటర్ల దిగుమతులపై కేంద్ర ప్రభుత్వం గురువారం ఆంక్షల్ని తీసుకొచ్చింది. ఇవి తక్షణమే అమల్లోకి వస్తాయని సంబంధిత అధికార వర్గాలు స్పష్టం చేశాయి. అయితే దేశీయంగా ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, ఆయా రకాల కంప్యూటర్ల తయారీని ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయమని మోదీ సర్కారు చెప్పుకుంటున్నా.. భద్రతాపరమైన కారణాలు కూడా ఇందుకు దారితీశాయని పేర్కొంటున్నారు. ఇక ‘ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆల్-ఇన్-వన్ పర్సనల్ కంప్యూటర్లు, అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్లు, సర్వర్ల దిగుమతులపై తక్షణమే ఆంక్షలు అమల్లోకి వస్తాయి’ అని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ (డీజీఎఫ్టీ) ఓ నోటిఫికేషన్లో తెలిపింది. మైక్రో కంప్యూటర్లు, పెద్ద/మెయిన్‌ఫ్రేమ్ కంప్యూటర్లు, కొన్ని డాటా ప్రాసెసింగ్ మెషీన్ల దిగుమతులపైనా ఆంక్షలు ఉంటాయన్నది.
చైనా, కొరియా లక్ష్యంగా..
పొరుగు దేశం చైనాతోపాటు దక్షిణ కొరియా నుంచి భారత్‌కు వస్తున్న ఎలక్ట్రానిక్స్ దిగుమతులకు అడ్డుకట్టు వేసేందుకే కేంద్ర ప్రభుత్వం ఈ తాజా నిర్ణయానికి వచ్చిందని చెప్తున్నారు. ప్రస్తుతం దేశీయ ఎలక్ట్రానిక్ మార్కెట్లో మెజారిటీ వస్తూత్పత్తులు ఈ రెండు దేశాలకే చెందినవి. ఆ తర్వాతి స్థానాల్లో జపాన్, అమెరికా ఉన్నాయి. కాగా, ఈ దిగుమతుల్ని నిషేధించడం తమ ఉద్దేశ్యం కాదని, వాటిని క్రమబద్ధీకరించడమే లక్ష్యమని అధికారులు చెప్తున్నారు. గ్లోబల్ ట్రేడ్ రిసెర్చ్ ఇనీషియేటివ్ (జీటీఆర్ఐ) వివరాల ప్రకారం చైనా నుంచి భారత్‌కు జరుగుతున్న దిగుమతుల్లో 65 శాతం ఎలక్ట్రానిక్స్, మెషినరీ, ఆర్గానిక్ కెమికల్సే ఉన్నాయి. కాగా, ‘ఈ ఆంక్షల వెనుక అనేక కారణాలున్నాయి. అయితే భారత పౌరుల భద్రతను కాపాడేందుకే మా తొలి ప్రాధాన్యత’ అని సీనియర్ ప్రభుత్వ అధికారి ఒకరు అన్నారు. ప్రస్తుతం దేశంలో ఇంటర్నెట్ వినియోగం బాగా పెరిగిపోతున్నదని, ఈ నేపథ్యంలో మెషీన్లు లేదా కొన్ని రకాల ఉపకరణాల వల్ల వారి భద్రతకు ముప్పు వాటిల్లకూడదనే ఈ నిర్ణయానికి వచ్చినట్టు వెల్లడించారు. ‘కొన్ని హార్డ్వేర్లు భద్రతాపరమైన సమస్యలకు దారితీసేలా ఉన్నాయి. సున్నితమైన, వ్యక్తిగత వివరాల విషయంలో వినియోగదారులు రాజీ పడాల్సి వస్తున్నది. అందుకే సదరు హార్డ్‌వేర్ ఉత్పత్తుల దిగుమతులకు వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూటీవో) మార్గదర్శకాలను అనుసరించి నిబంధనల్ని కఠినతరం చేశాం’ అన్నారు.
అనుమతులు తప్పనిసరి
దిగుమతిదారులు ఇకపై ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, కంప్యూటర్లను దేశంలోకి దిగుమతి చేసుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లేదా లైసెన్స్‌ను తప్పక తీసుకోవాల్సిందే. అయితే రిసెర్చ్ అండ్ డెవలప్మెంట్ (ఆర్అండ్డీ), టెస్టింగ్, బెంచ్‌మార్కింగ్, ఎవల్యూషన్, రిపేర్, రిటర్న్, ప్రోడక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ కోసం దిగుమతి చేసుకునే 20 ఐటెమ్స్దాకా అనుమతులు అక్కర్లేదని ప్రభుత్వ వర్గాలు చెప్తున్నాయి. అలాగే బ్యాగేజ్ నిబంధనల కింద ఉండే దిగుమతులకూ ఈ ఆంక్షలు వర్తించబోవని అంటున్నారు. బ్యాగేజ్లో ఏదో ఒక ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, పర్సనల్ కంప్యూటర్ లేదా అల్ట్రా స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ కంప్యూటర్ను విదేశాల నుంచి దేశంలోకి తీసుకురావడానికి అనుమతి ఉంటుందని వివరిస్తున్నారు. ఈ-కామర్స్ పోర్టల్స్ ద్వారా కొనుక్కున్నవి లేదా పోస్ట్‌గానీ, కొరియర్ ద్వారాగానీ వచ్చినవాటికి పర్మీషన్ ఉంటుంది. అయితే పన్నులు, సుంకాలకు లోబడే ఇదంతా ఉంటుందని కేంద్రం స్పష్టం చేస్తున్నది.

- దేశీయ మార్కెట్లో ప్రధాన విదేశీ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల కంపెనీల్లో హెచ్‌సీఎల్, సామ్సంగ్, డెల్, ఎల్జీ, ఏసర్, యాపిల్, లెనోవా, హెచ్‌పీ
- ఏటా భారత్‌లోకి దాదాపు రూ.60-65వేల కోట్ల విలువైన ల్యాప్‌టాప్, ట్యాబ్లెట్, కంప్యూటర్ల దిగుమతులు
- 2022-23లో దేశంలోకి రూ.45వేల కోట్ల విలువైన ల్యాప్‌టాప్‌సహా పర్సనల్ కంప్యూటర్స్ దిగుమతులు
- గత ఆర్థిక సంవత్సరం భారత్‌లోకి రూ.4,578 కోట్ల డాటా ప్రాసెసింగ్ మెషీన్ల దిగుమతులు
- మైక్రో కంప్యూటర్లు/ప్రాసెసర్ల దిగుమతుల విలువ రూ.10 కోట్లు
రక్షణాత్మక విధానం సరికాదు
ప్రపంచీకరణ వేగంగా జరుగుతున్న వేళ గ్లోబల్ ఎకానమీలో కీలకమైన భారత్ వంటి దేశాలు రక్షణాత్మక ధోరణిని అవలంభించడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని ఇప్పుడు మెజారిటీ ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఒకవేళ భద్రతాపరమైన అంశాలే కీలకంగా ఉంటే.. దేశంలో ఆయా ఉత్పత్తుల తయారీ విస్తరించే దిశగా ముందు అడుగులు వేయాలని, ఆ తర్వాతే ఈ రకమైన నిర్ణయాలు తీసుకుంటే సత్ఫలితాలు వస్తాయని, లేదంటే దుష్పరిణామాలు తప్పవని కూడా వారు ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నారు. ఈ క్రమంలోనే ఉత్పాదక ప్రోత్సాహకాలు, పన్నులు-సుంకాల మినహాయింపు, సులభతర రుణాలు వంటివి దేశంలో వేగవంతమైన పారిశ్రామికీకరణకు దోహదం చేయగలవని సూచిస్తున్నారు.

ధరలు పైపైకే..
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో దేశంలో ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు, ఆయా రకాల కంప్యూటర్ల ధరలు పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పరిశ్రమ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తమ నిర్ణయంతో దేశంలో వీటి తయారీ పెరుగుతుందే తప్ప, ధరలు పెరుగబోవని అధికార వర్గాలు చెప్పుకుంటున్నా.. వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉంటాయని ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ గట్టిగా వాదిస్తుండటం గమనార్హం. నిజానికి నేడు నిత్యవసర వస్తువులతోపాటు మొబైల్ ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, రకరకాల విడిభాగాలు, సొలార్ సెల్ మాడ్యూల్స్, ఐసీల వంటి ఎన్నో పారిశ్రామిక ఉత్పత్తుల కోసం చైనాపైనే భారత్ ఆధారపడుతున్నదని గుర్తుచేస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఈ రకమైన ఆంక్షలు దేశీయ మార్కెట్లో వాటి ధరల పెరుగుదలకే దారితీస్తాయని పేర్కొంటున్నారు. ఇక ఈ నిర్ణయం నేపథ్యంలో మార్కెట్లో ఎప్పుడూ కనిపించే డిస్కౌంట్లు, ఆఫర్లకూ కోత పడకతప్పదని అటు వ్యాపార వర్గాలూ అంటున్నాయి.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Exercise | పీసీఓఎస్ వంటి సమస్యలు ఉన్న మహిళలు చేయాల్సిన వ్యాయామాలు ఇవే..
Boyfriend Falls From Balcony | నాలుగో అంతస్తు నుంచి కిందపడి వ్యక్తి మృతి.. ఇన్ఫ్లుయెన్సర్ అయిన ప్రియురాలిపై అతడి తల్లి ఫిర్యాదు
Vaccine | శీతాకాలంలో వీరికి శ్వాసకోశ సమస్యల ముప్పు ఎక్కువ.. టీకా తీసుకోవాలంటున్న వైద్యులు..
Nuclear War | మానవాళికి ఏఐ, న్యూక్లియర్ ముప్పు.. 2100లోపు మానవాళి అంతం తప్పదా
New Districts | కొత్త జిల్లాల ఏర్పాటు చారిత్రాత్మక ఘట్టం.. కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

