Cement | న్యూఢిల్లీ, ఏప్రిల్ 22 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) దేశీయ మార్కెట్లో సిమెంట్ ధరలు 2 నుంచి 4 శాతం (రూ.15-20) మేరకు పెరిగే అవకాశం ఉన్నట్టు ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ, విశ్లేషణ సంస్థ క్రిసిల్ తాజా రిపోర్టులో అంచనా వేసింది. డిమాండ్ 6.5 శాతం నుంచి 7.5 శాతం వరకు పెరగవచ్చని పేర్కొన్నది. ప్రధాన మౌలిక వసతుల కల్పనకు, గ్రామీణ హౌజింగ్ ప్రాజెక్టులకు బడ్జెట్లో 10 శాతందాకా కేటాయింపులు పెరగడం, అధిక వర్షపాతం నమోదు అంచనాలు సిమెంట్ వినియోగాన్ని, పరిశ్రమను ఉత్సాహపరుస్తున్నాయని పేర్కొన్నది. వ్యవసాయం లాభసాటిగా మారితే గ్రామీణ ప్రాంతాల్లో ఇండ్ల నిర్మాణాలు ఊపందుకుంటాయని క్రిసిల్ ఇంటిలిజెన్స్ అసోసియేట్ డైరెక్టర్ సచిదానంద్ చౌబే చెప్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం (2024-25)సిమెంట్ ఇండస్ట్రీలో వృద్ధిరేటు 4.5-5.5 శాతంగానే ఉన్నది. రోడ్ల నిర్మాణాలు , రైల్వేలు, సాగునీటి ప్రాజెక్టులు, పట్టణ మౌలిక సదుపాయా ల కల్పన ఈ ఆర్థిక సంవత్సరం పెద్ద ఎత్తున జరిగే వీలుండటం సిమెంట్ వినియోగ అంచనాలను పెంచేస్తున్నాయి. ప్రధాన మంత్రి గ్రామీణ సడక్ యోజన , ఉపాధి హామీ చట్టం పథకాలు సైతం సిమెంట్ ఇండస్ట్రీకి దన్నునిస్తున్నట్టు పరిశ్రమ వర్గాలు చెప్తున్నాయి.
దేశంలోని అన్ని ప్రధాన నగరాలు, పట్టణాల్లో నిర్మాణరంగం నిరాశాజనకంగా ఉండటం సిమెంట్ పరిశ్రమకు ఎదురుదెబ్బగానే విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. గృహ రుణాలపై వడ్డీరేట్లు ఆశించిన స్థాయిలో తగ్గకపోవడం కొనుగోలుదారులను నిరుత్సాహపరుస్తున్నదని చెప్తున్నారు. ఇప్పటికే పెరిగిన నిర్మాణ వ్యయం కూడా కస్టమర్లను వేచిచూసే ధోరణిలోకి నెడుతున్నదని, దీంతో ఇప్పటికే నిర్మించిన ఇండ్లు అమ్ముడుపోక, కొత్త ప్రాజెక్టులపై రియల్టర్లు పెద్దగా ఆసక్తి చూపట్లేదన్న వాదనలూ వినిపిస్తున్నాయి. ప్రధాన నగరా ల్లో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు పుంజుకొంటే సిమెంట్ ధరలు ఇంకా పెరిగే వీలుందన్న అంచనాలూ ఉన్నాయి.