Chanda Kochhar | వీడియోకాన్ రుణాల కేసులో ఐసీఐసీఐ మాజీ ఎండీ కం సీఈవో చందాకొచ్చర్ దంపతులకు మూడు రోజుల సీబీఐ కస్టడీ విధిస్తూ ప్రత్యేక న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. అంతకు ముందు ఈ కేసులో వీరిని శుక్రవారం సీబీఐ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అటుపై ముంబైలోని సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం ముందు హాజరు పరిచారు.
సీబీఐ వాదనతో ఏకీభవించిన ప్రత్యేక న్యాయస్థానం.. చందాకొచ్చర్ దంపతులకు మూడు రోజుల కస్టడీ విధించింది. అంటే ఈ నెల 26 వరకు చందాకొచ్చర్ దంపతులు సీబీఐ కస్టడీలో ఉంటారు. శుక్రవారం విచారణకు హాజరైన చందాకొచ్చర్ దంపతులు తమ దర్యాప్తునకు సహకరించడం లేదని సీబీఐ ఆరోపించింది. తమ ప్రశ్నలకు సమాధానం దాటేస్తున్నారని పేర్కొంది.
ఐసీఐసీఐ బ్యాంక్ సీఈవో కం ఎండీగా చందాకొచ్చర్ తన హయాంలో 2009-11 మధ్య వీడియోకాన్ గ్రూప్ దాని అనుబంధ కంపెనీలకు రూ.1,875 కోట్ల రుణాలిచ్చేందుకు ఇతర బ్యాంకులపై వత్తిడి తెచ్చారని సీబీఐ అభియోగం. 2009 ఆగస్టు 26న వీడియోకాన్ ఇంటర్నేషనల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (వీఐఈఎల్)కు రూ.300 కోట్లు, 2011 అక్టోబర్ 31న వీడియోకాన్ ఇండస్ట్రీస్‌కు ఇచ్చిన రూ.750 కోట్ల రుణాలు మొండి బకాయిలుగా మారాయని పేర్కొంది. దీంతో బ్యాంకుకు రూ.1,730 కోట్ల నష్టం వాటిల్లిందని సీబీఐ తెలిపింది.