న్యూఢిల్లీ, డిసెంబర్ 23: బ్యాంకుల కన్సార్టియంను రూ.4 వేల కోట్లకుపైగా మోసగించారన్న ఆరోపణలపై అభిజీత్ గ్రూపునకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ కంపెనీతోపాటు ఆ సంస్థ డైరెక్టర్లపై సీబీఐ కేసు నమోదు చేసింది. ఈ కేసులో గురువారం నాగ్‌పూర్, ముంబై, రాంచీ, కోల్‌కతా, దుర్గాపూర్, ఘజియాబాద్, విశాఖపట్నం సహా పలు నగరాల్లోని 16 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు నిర్వహించినట్టు అధికారులు వెల్లడించారు.
కోల్‌కతాకు చెందిన కార్పొరేట్ పవర్ లిమిటెడ్ జార్ఖండ్‌లో విద్యుత్తు ప్లాంట్ ఏర్పాటు కోసం 2009-13 మధ్య కాలంలో తప్పుడు స్టేట్మెంట్లతో 20 బ్యాంకులతో కూడిన కన్సార్టియంను రూ.4,037.87 కోట్లకు మోసగించినట్టు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు చేయడంతో సీబీఐ ఈ కేసు నమోదు చేసింది. కార్పొరేట్ పవర్ లిమిటెడ్‌తోపాటు ఆ కంపెనీ డైరెక్టర్లు మనోజ్ జైస్వాల్, అభిషేక్ జైస్వాల్, రాజీవ్ కుమార్, వైశాల్ జైస్వాల్, మున్నా కుమార్ జైస్వాల్, పీఎన్ కృష్ణన్, రాజీవ్ గోయల్, అరుణ్‌కుమార్ శ్రీవాస్తవ, ఎస్ఎన్ గైక్వాడ్, ప్రేమ్ ప్రకాశ్ శర్మ, అరుణ్ గుప్తాను నిందితులుగా పేర్కొన్నది. అభిజీత్ గ్రూపునకు చెందిన పలు కంపెనీలు, వాటి డైరెక్టర్లు ఇప్పటికే బొగ్గు కుంభకోణానికి సంబంధించిన కేసుల్లో సీబీఐ దర్యాప్తును ఎదుర్కొంటున్నారు. ఈ కేసుల్లో వీరిపై ఇప్పటికే చార్జిషీట్లు దాఖలయ్యాయి.