Cash Back Credit Card | ఫెస్టివల్ సీజన్ వచ్చిందంటే చాలు.. ప్రతి ఒక్కరూ తమ కుటుంబ అవసరాలకు ఏదో ఒక వస్తువు.. మొబైల్.. ఫ్రిజ్.. హోం థియేటర్.. పిల్లల చదువుల కోసం లాప్టాప్ కొంటుంటారు. వీటికి అదనం బట్టల షాపింగ్. పండుగల వేళ పలు సంస్థలు తమ కస్టమర్లను ఆకర్షించడానికి క్యాష్ ఆఫర్లు ఇస్తుంటాయి. వివిధ బ్యాంకుల క్రెడిట్ కార్డు సంస్థలు ఈ క్యాష్ బ్యాక్ ఆఫర్లు అంద చేస్తుంటాయి.
ప్రముఖ ప్రైవేట్ బ్యాంక్ యాక్సిస్ బ్యాంక్, దేశంలోనే అతిపెద్ద ప్రభుత్వ వాణిజ్య బ్యాంక్.. భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ) కొత్తగా క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డు (Cash Back Credit Card) తెచ్చాయి. ఎలక్ట్రానిక్ దిగ్గజం శ్యామ్సంగ్తో కలిసి యాక్సిస్ బ్యాంక్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డు విడుదల చేసింది. ఇక ఎస్బీఐ ఆన్లైన్ షాపింగ్ చేసేవారికి ఐదు శాతం క్యాష్‌బ్యాక్ ఆఫర్ అందుబాటులోకి తెచ్చింది. ఈ క్యాష్ బ్యాక్ క్రెడిట్ కార్డులు తీసుకోవాలనుకుంటే.. అందుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఈ పంచ సూత్రాలు ఏం చెబుతున్నాయో చూడండి..
వినియోగదారులకు రివార్డులు అందించే విషయంలో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు, జనరల్ క్రెడిట్ కార్డులకు చాలా తేడా ఉంటుంది. ఆఫర్లో వచ్చే రివార్డులు కస్టమర్లు తమ అవసరాలకు ఉపయోగపడతాయా.. సరిపోతాయా లేదా ముందుగానే చెక్ చేసుకోవాలి. నిత్యం మీరు చేసే షాపింగ్, ఇతర ఖర్చులకు రివార్డులు కలిసి రాకపోతే సదరు క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులతో పెద్దగా యూజ్ ఏమీ ఉండదు.
కొన్ని సందర్భాల్లో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డుల కంటే జనరల్ క్రెడిట్ కార్డులే బెటర్ బెనిఫిట్లు అందించే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రతి ట్రాన్సాక్షన్‌పై వచ్చే క్యాష్‌బ్యాక్ కాక మీ రోజువారీ ఖర్చులపై వచ్చే రివార్డులను అంచనా వేయాలి. వాస్తవంగా అప్పటికప్పుడు వచ్చే బెనిఫిట్లతో తృప్తి పడే కస్టమర్లను లక్ష్యంగా చేసుకునే బ్యాంకులు క్యాష్‌బ్యాక్ క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి.
ఇలా కాక దీర్ఘకాలికంగా ఎక్కువ బెనిఫిట్లు అందించే కార్డులను తీసుకుంటేనే యూజర్లకు లాభం చేకూరుతుంది. జనరల్ కొనుగోళ్లపైనే ౦.2-2% మధ్య క్యాష్ బ్యాక్ ఆఫర్ లభిస్తుంది. కో- బ్రాండెడ్ క్రెడిట్ కార్డులపై చేసే కొన్ని నిర్దిష్ట ఖర్చులపై 5-10 % క్యాష్‌బ్యాక్ ఆఫర్ వచ్చినా మార్కెట్లో అధిక రివార్డులు ఇచ్చే క్రెడిట్ కార్డులు బోలెడున్నాయి.
క్రెడిట్ కార్డుల యూజర్లు తమ అవసరాలు, ఖర్చుల తీరును బట్టి ఎటువంటి క్రెడిట్ కార్డు సరిపోతుంది చెక్ చేసుకోవాలి. ఖర్చు పెరుగుదలకు అనుగుణంగా రివార్డు పాయింట్లు పెరిగితే ఎక్కువ బెనిఫిట్ లభిస్తుంది. క్యాష్‌బ్యాక్ కంటే ఇతర కార్డులు అనుకూలంగా ఉంటాయని తేలితే వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. కనుక ఆయా క్రెడిట్ కార్డులతో లభించే ప్రయోజనాలను ముందుగా చెక్ చేసుకుని.. మీ అవసరాలకు సరిపోయే క్రెడిట్ కార్డు తీసుకుంటే బాగుంటుంది.
యూజర్లు క్రెడిట్ కార్డులో చేసే ఖర్చులో కొంత ఖర్చు వారి అకౌంట్లో జమ చేస్తాయి బ్యాంకులు- క్రెడిట్ కార్డు సంస్థలు. కనుక ఆయా క్రెడిట్ కార్డు జారీ చేసే సంస్థలు అందించే బెనిఫిట్లు, క్యాష్‌బ్యాక్ ఆఫర్ల గురించి ముందే తెలుసుకోవాలి. ఒక్కోసారి యూజర్ల బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఆన్లైన్ వ్యాలెట్లోకి ట్రాన్స్ఫర్ కూడా చేయొచ్చు. మరికొన్ని సార్లు క్రెడిట్ కార్డు జారీ సంస్థలు పేర్కొన్న సంస్థలు-మర్చంట్ల వద్దే సదరు క్యాష్ బ్యాక్ ఆఫర్ వినియోగించాల్సి రావచ్చు.
ప్రణాళిక ప్రకారం వాడుకుంటే క్రెడిట్ కార్డు ఉపయోగంగానే ఉంటుంది. క్రెడిట్ కార్డు బిల్లు.. గడువులోగా చెల్లించే స్థోమత ఉందా? లేదా? చెక్ చేసుకోవాలి. ఒకవేళ సకాలంలో చెల్లించలేం అనుకుంటే క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేయొద్దని నిపుణులు చెబుతున్నారు. అలా కాకుండా స్థోమత లేకున్నా క్రెడిట్ కార్డు తీసుకుంటే క్రెడిట్ స్కోర్.. అంటే సిబిల్ స్కోర్‌పైనా.. మొత్తం సంబంధిత వ్యక్తి క్రెడిట్ చరిత్రపైనా ప్రతికూల ప్రభావం పడుతుందని ఆర్థిక వేత్తలు చెబుతున్నారు.