Financial Goals | ప్రతీ ఒక్కరికీ వారివారి ఆర్థిక లక్ష్యాల సాధనకు నగదే ప్రధానం. కానీ ఆ నగదు పొదుపు విషయంలో అనేక అడ్డంకులు వస్తున్నాయి. అందుకే పట్టుదల, క్రమశిక్షణ, సరైన వ్యూహాలుండాలి. అప్పుడే ఫైనాన్షియల్ గోల్స్ సాకారం కాగలవు. అసలు ఆర్థిక లక్ష్యాల సాధనను ఏవి పక్కదారి పట్టిస్తున్నాయో చూస్తే..
క్రమశిక్షణ లేకపోవడం వల్ల ఆర్థిక లక్ష్యాల సాధన జటిలంగా మారుతుంది. ఉదాహరణకు మార్కెట్లో కొత్త స్మార్ట్ఫోన్ కనిపించిందని, ఇప్పుడున్న ఫోన్ బాగున్నా కొనేయడం అక్షరాలా దుబారానే. అలాగే అనవసరపు టూర్లతోనూ లేనిపోని ఖర్చే. ఇలాంటివన్నీ చాపకింద నీరులా మీ ఆర్థిక లక్ష్యాలను దెబ్బతీస్తాయని మరువద్దు.
ద్రవ్యోల్బణాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఆదాయాలను పెంచుకుంటూపోవాలి. లేకపోతే మన సంపాదన, పొదుపును పెరిగే ధరలు మింగేస్తాయి. అది పిల్లల చదువుకయ్యే ఖర్చులు కావచ్చు లేదా మనం కొనాలనుకునే ఇల్లు కావచ్చు ఏదైనాసరే రోజులు గడుస్తున్నకొద్దీ మరింత ఎక్కువగా నగదును పెట్టాల్సి వస్తుందని మరువద్దు.
జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఊహించలేం. ముఖ్యంగా వైద్యవసరాలు ఎలా ఉంటాయో కూడా తెలియదు. అనుకోని ఆరోగ్య సమస్యలతో కూడా ఆర్థిక లక్ష్యాలు దెబ్బతింటాయి.
మార్కెట్లో నెలకొనే ఒడిదొడుకులు కూడా ఆర్థిక లక్ష్యాలకు ఆటంకమే. పెట్టిన పెట్టుబడుల్లో రాబడులు తగ్గి అనుకున్న స్థాయిలో నగదు సమీకరణలు కష్టమవుతాయి. కాబట్టి మన చేతిలో లేనివాటికి మనం ఏమీ చేయలేం. ఉన్నవాటికైనా జాగ్రత్తతో ముందుకెళ్తే అనుకున్నది సాధిస్తాం.