ముంబై, నవంబర్ 7: స్థిరాస్తి లావాదేవీల్లో నగదు వాడకం క్రమేణా పెరుగుతున్నట్టు ఓ తాజా నివేదికలో తేలింది. డీమానిటైజేషన్ జరిగి ఏడేండ్లు పూర్తయిన సందర్భంగా ఓ వార్షిక సర్వే విడుదలైంది. సోషల్ మీడియా వేదిక లోకల్‌సర్కిల్స్ దేశవ్యాప్తంగా 363 జిల్లాల్లో ఈ సర్వేను చేపట్టింది. ఇందులో 44వేల మంది పాల్గొన్నారు. గత ఏడేండ్లలో వీరిలో మెజారిటీ శాతం ఇండ్లను కొన్నవారే. కాగా, వీళ్లలో 24 శాతం మందే ప్రాపర్టీ కొన్నప్పుడు నగదు రూపంలో చెల్లింపులు జరుపలేదని ఈసారి చెప్పారు. రెండేండ్ల క్రితం ఇది 30 శాతంగా ఉన్నట్టు సర్వే పేర్కొన్నది. ఇక 28 శాతానికిపైగా తాము ఇండ్లు కొన్నప్పుడు ఆ విలువలో 10-20 శాతం నగదు రూపంలోనే చెల్లించామన్నారు. 15 శాతం మందైతే 50 శాతానికిపైగా నగదు ఇచ్చినట్టు చెప్పారు. 30-50 శాతం మేర నగదులో చెల్లించినవారు 18 శాతంగా ఉన్నట్టు స్పష్టమైంది.
ఇతర కొనుగోళ్లలో..
మరోవైపు డిజిటల్ లావాదేవీలు సరికొత్త రికార్డులను తాకుతున్నప్పటికీ 82 శాతం మంది.. కిరాణా, హోటల్-రెస్టారెంట్లలో, ఫుడ్ డెలివరీ సమయంలో నగదునే వినియోగిస్తున్నట్టు ఈ సర్వేలో చెప్పడం విశేషం. 2016 నవంబర్ 8 రాత్రి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అనూహ్య రీతిలో చలామణి నుంచి రూ.1,000, రూ.500 నోట్లను రద్దు చేస్తున్నట్టు సంచలన ప్రకటన చేసిన విషయం తెలిసిందే. అప్పుడు సర్క్యులేషన్లో ఉన్న నగదులో 86 శాతానికిపైగా పెద్ద నోట్లే. అలాగే కొత్తగా రూ.2,000 కరెన్సీతోపాటు సరికొత్త రూపంలో రూ.500 నోట్లనూ పరిచయం చేసిన సంగతీ విదితమే.