న్యూఢిల్లీ, జూలై 1: దేశవ్యాప్తంగా వాహన అమ్మకాలకు డిమాండ్ క్రమంగా పడిపోతున్నది. గత నెలకుగాను కార్ల తయారీలో అగ్రగామి సంస్థలైన మారుతి సుజుకీ, హ్యుందాయ్, టాటా మోటర్స్ అమ్మకాలు రెండంకెల వరకు పడిపోయాయి. కానీ, మహీంద్రా అండ్ మహీంద్రా వాహనాలకు డిమాండ్ నెలకొన్నది. దేశీయంగా ప్యాసింజర్ వాహన విక్రయాలు 13 శాతం తగ్గి 1,18,906 యూనిట్లకు పడిపోయినట్లు మారుతి సుజుకీ ప్రకటించింది. క్రితం ఏడాది ఇదే నెలలో 1,37,160 యూనిట్లు అమ్మడయ్యాయి. చిన్న కార్లకు డిమాండ్ పడిపోవడంతో మొత్తం ప్యాసింజర్ వాహన విక్రయాలపై పడిందని మారుతి సీనియర్ ఎగ్జిక్యూటివ్ అధికారి రాహుల్ భార్తి తెలిపారు.
అలాగే హ్యుందాయ్ మోటర్స్ అమ్మకాలు కూడా ఏడాది ప్రాతిపదికన 12 శాతం తగ్గి 44,024 యూనిట్లకు పరిమితమయ్యాయి. గత నెలలో ఆటోమొబైల్ రంగంలో మందకొడి పరిస్థితులు నెలకొన్నాయి..టాటా మోటర్స్ నూతన వాహనాలను విడుదల చేసినప్పటికీ ఆశించిన స్థాయిలో పనితీరు కనబరచలేదని టాటా మోటర్స్ ప్యాసింజర్ వాహన విభాగ ఎండగీ శైలేష్ చంద్ర తెలిపారు. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు ఏడాది ప్రాతిపదికన 5 శాతం ఎగబాకి 28,869 యూనిట్లకు చేరుకున్నాయి.