హైదరాబాద్, అక్టోబర్ 3: దేశీయ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ క్యాప్రీ గ్లోబల్ హౌజింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ తెలంగాణలో తన విస్తరణ కార్యకలాపాలను వేగవంతం చేసింది. తన తొలి రీజినల్ కార్యాలయాన్ని శుక్రవారం ప్రారంభించింది. ఈ సందర్భంగా కంపెనీ బిజినెస్ హెడ్ మునీష్ జైన్ మాట్లాడుతూ..దక్షిణాదికి తమ వ్యాపారాన్ని విస్తరించాలనే ఉద్దేశంతో ఇక్కడ రీజినల్ ఆఫీస్‌ను తెరిచినట్టు, అలాగే కరీంనగర్, వరంగల్‌లో శాఖలను కూడా ప్రారంభించినట్టు చెప్పారు.
భవిష్యత్తులో మరో ఐదు శాఖలను తెలంగాణ రాష్ట్రంలో ప్రారంభించాలనుకుంటున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో 28 లక్షల నూతన గృహాలకు డిమాండ్ ఉంటుందని అంచనావేసిన సంస్థ.. అందుకు తగ్గట్టుగానే తమ వ్యాపార విస్తరణ ప్రణాళికను వేగవంతం చేసినట్టు చెప్పారు. 2,100 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ రీజినల్ సెంటర్‌తో తెలంగాణ వ్యాప్తాంగా ఆర్థిక సేవలు అందించడానికి వీలు పడనున్నదన్నారు.