క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ అనేది స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ లేదా రియల్ ఎస్టేట్ తదితర పెట్టుబడుల నుంచి పొందిన లాభాలపై విధించేది. ఇందులో మళ్లీ లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ/దీర్ఘకాలిక మూలధన లాభాలు), షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ/స్వల్పకాలిక మూలధన లాభాలు) పన్నులుంటాయి. అయితే మూలధన నష్టాలను వాడుకొని లాభాలపై ఈ పన్ను భారాన్ని తప్పించడానికి ఓ క్రమపద్ధతిలో, వివరణాత్మక ప్రక్రియను ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-1961 కల్పిస్తున్నది. ఇది వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల పన్ను ఆదాకు ఓ చక్కని మార్గమేనని చెప్పుకోవచ్చు.
మార్కెట్ ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఇక్కడ ఒడిదొడుకులు అత్యంత సహజం. అయితే కొన్ని పెట్టుబడుల్లో పురోగతి అనేదే కనిపించదు. అప్పుడు ఆశించిన స్థాయిలో రాబడులను అందించలేకపోతున్న ఆ పెట్టుబడులకు దూరంగా జరగడమే ఉత్తమం. ఇలాంటి తరుణంలో వ్యూహాత్మకంగా పన్నుల భారాన్ని తప్పించుకొనే మార్గాలున్నాయి. ఆదాయ పన్ను (ఐటీ) చట్టం-1961లోని సెక్షన్ 112ఏ, సెక్షన్ 50ఏఏ వంటి పలు సెక్షన్లు ఇందుకు దోహదం చేస్తున్నాయి. వీటి ప్రకారం ఇతర పెట్టుబడుల నుంచి పొందిన లాభాలపై చెల్లించాల్సిన లాంగ్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎల్టీసీజీ) లేదా షార్ట్-టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ (ఎస్టీసీజీ) పన్నుల నుంచి ఆయా పెట్టుబడులపై వచ్చిన నష్టాల ద్వారా పూర్తిగా మినహాయింపు లేదా తగ్గింపును పొందవచ్చు. దీన్నే ట్యాక్స్-లాస్ హార్వెస్టింగ్ అంటారు. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
ఉదాహరణకు.. ఏ, బీ అనే ఓ రెండు కంపెనీల్లో లక్ష రూపాయల చొప్పున మొత్తం రూ.2 లక్షలతో మీరు కొన్ని షేర్లను కొన్నారు. కొంతకాలం తర్వాత ఏ కంపెనీ షేర్లను రూ.1.20 లక్షలకు అమ్మేశారు. దీంతో మీకు రూ.20,000 స్వల్పకాలిక మూలధన లాభం వచ్చింది. అలాగే బీ కంపెనీ షేర్లనూ అమ్మేశారు. కానీ అందుకు మీకు రూ.80,000 మాత్రమే వచ్చాయి. ఇక్కడ రూ.20,000 నష్టపోయారు.
అప్పుడు ఏ కంపెనీ షేర్ల అమ్మకం ద్వారా వచ్చిన రూ.20,000 లాభాన్ని.. బీ కంపెనీ షేర్ల విక్రయం ద్వారా వాటిల్లిన రూ.20,000 నష్టంతో సర్దుబాటు చేసుకోవచ్చు. దీనివల్ల మీరు పొందిన స్వల్పకాలిక మూలధన లాభంపై ఎస్టీసీజీ ట్యాక్స్‌ను చెల్లించాల్సిన అవసరం ఉండదు. తద్వారా రూ.4,000 (రూ.20,000లలో 20 శాతం) ఆదా చేసుకున్నట్టవుతుంది. ఒకవేళ దీర్ఘకాలిక మూలధన లాభాల పన్ను వర్తించినైట్టెతే రూ.2,500 (రూ.20,000లలో 12.5 శాతం) ఆదా చేసుకున్నట్టు చెప్పుకోవచ్చు.
స్టాక్ మార్కెట్ నమోదిత షేర్లు, ఈక్విటీ ఆధారిత మ్యూచువల్ ఫండ్స్‌ల్లో పెట్టుబడుల ద్వారా ఏడాదిలోపు లాభాలను పొందినైట్టెతే స్వల్పకాలిక మూలధన లాభం (ఎస్టీసీజీ)గా పరిగణిస్తారు. దీనికిగాను లాభాల్లో 20 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.
స్టాక్ మార్కెట్ నమోదిత షేర్లు, ఈక్విటీయేతర ఆస్తుల్లో (భూములు, భవనాలు, నగలు, క్రిప్టోకరెన్సీల వంటివి) పెట్టుబడుల ద్వారా ఏడాది తర్వాత లాభాలను అందుకున్నైట్టెతే దీర్ఘకాలిక మూలధన లాభం (ఎల్టీసీజీ)గా పరిగణిస్తారు. దీనికిగాను లాభాల్లో 12.5 శాతాన్ని పన్నుగా చెల్లించాల్సి ఉంటుంది.
గుర్తుంచుకోండి..
మార్కెట్ ఒడిదొడుకులు పెట్టుబడులపై ఓ నిర్ణయం తీసుకునేటప్పుడు దాన్ని లోతుగా అధ్యయనం చేసిగానీ తీసుకోవద్దు. ఎందుకంటే మార్కెట్లో ఒడిదొడుకులు సహజం. అప్ అండ్ డౌన్స్‌కు భయపడితే అది తొందరపాటు నిర్ణయాలకు దారితీసే ప్రమాదమున్నది. దానివల్ల నష్టాలు ఎదురుకావచ్చు. కాబట్టి పెట్టుబడుల ఉపసంహరణకు ముందు మీకు వాటిల్లుతున్న నష్టాలకు గల కారణాలను విశ్లేషించండి. తాత్కాలికమేనని భావిస్తే పెట్టుబడులను కొనసాగించడమే తెలివైన పని. బలమైన కారణం ఉండి ఇకపైనా సదరు పెట్టుబడి వృథానేనని అనుకుంటే దాన్ని వదిలించుకోండి.
పోర్ట్‌ఫోలియో రీబ్యాలెన్సింగ్ అనేది ప్రతీ మదుపరికి చాలాచాలా ముఖ్యం. ఒకే రకమైన పెట్టుబడులకు ప్రాధాన్యం ఇవ్వకుండా వైవిధ్యం కనబరిస్తే మీ ఇన్వెస్ట్మెంట్స్ పోర్ట్‌ఫోలియో సమతూకంగా ఉంటుంది. ఆర్థిక లక్ష్యాల సాధనకు కూడా అనువుగా ఉంటుంది. కొన్ని పెట్టుబడులు స్వల్పకాలానికి, మరికొన్ని పెట్టుబడులు దీర్ఘకాలానికి సరిపోయేలా ఉంటాయి. ఈ విచక్షణను గుర్తెరిగి ముందుకెళ్తే ఆకర్షణీయ లాభాలను సొంతం చేసుకోవచ్చు.
స్వల్పకాలిక మూలధన నష్టాలను స్వల్పకాలిక, దీర్ఘకాలిక మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకోవచ్చు. కానీ దీర్ఘకాలిక మూలధన నష్టాలను దీర్ఘకాలిక మూలధన లాభాలతోనే సర్దుబాటు చేసుకోగలం.
ఒక సంవత్సరంలో మీ మూలధన లాభాలను మించి మీ మూలధన నష్టాలు ఉన్నైట్టెతే ఆ నష్టాలను వచ్చే ఎనిమిదేండ్లదాకా ఏటేటా మీ వార్షిక మూలధన లాభాలతో సర్దుబాటు చేసుకుంటూపోవచ్చు. ఫలితంగా పన్ను భారం నుంచి ఉపశమనం పొందవచ్చు.