న్యూఢిల్లీ, జనవరి 27: ప్రభుత్వరంగ ఆర్థిక సేవల సంస్థ కెనరా బ్యాంక్ ఆకర్షణీయమైన ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను బ్యాంక్ రూ.4,104 కోట్ల స్టాండలోన్ నికర లాభాన్ని గడించింది. ఆదాయం పుంజుకోవడం, నిరర్థక ఆస్తులు తగ్గిపోవడంతో అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.3,656 కోట్ల లాభంతో పోలిస్తే 12.25 శాతం పెరుగుదల నమోదైందని వెల్లడించింది. బ్యాంక్ ఆదాయం కూడా రూ.32,334 కోట్ల నుంచి రూ.36,114 కోట్లకు ఎగబాకినిట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. స్థూల నిరర్థక ఆస్తుల విలువ 4.39 శాతం నుంచి 3.34 శాతానికి దిగొచ్చాయని, అలాగే నికర నిరర్థక ఆస్తుల విలువ కూడా 0.99 శాతం నుంచి 0.89 శాతానికి తగ్గినట్టు బ్యాంక్ ఎండీ, సీఈవో కే సత్యనారాయణ రాజు తెలిపారు.