న్యూఢిల్లీ, నవంబర్ 8: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ గృహ రుణాలపై వడ్డీరేట్లను పెంచింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ల(ఆర్ఎల్ఎల్ఆర్)ను 20 బేసిస్ పాయింట్ల వరకు సవరించింది. పెంచిన వడ్డీరేట్లు ఇప్పటికే అమలులోకి వచ్చాయి. అన్ని రకాల కాలపరిమితులు కలిగిన రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 20 బేసిస్ పాయింట్లు అధికమవనున్నది. మరోవైపు, ఆర్ఎల్ఎల్ఆర్తో అనుసంధానమైన గృహ రుణాలను 8.80 శాతం వడ్డీకే అందిస్తున్నది. అక్టోబర్ 1 నుంచి డిసెంబర్ 31 వరకు తీసుకున్న రుణాలకు మాత్రమే ఈ వడ్డీ వర్తించనున్నదని పేర్కొంది. మరోవైపు, విదేశీ డిపాజిట్లను ఆకట్టుకోవడానికి ప్రత్యేక స్కీంను ప్రవేశపెట్టింది. మరోవైపు ఎన్ఆర్ఐ-ఎన్ఆర్ఈ డిపాజిట్లపై వడ్డీరేటును 7 శాతం వరకు పెంచిన బ్యాంక్.. ఎఫ్సీఎన్ఆర్పై రేటును 4.60 శాతానికి సవరించింది. ఈ ఆఫర్ స్వల్పకాలంపాటు మాత్రమే అమలులో ఉండనున్నది.