హైదరాబాద్, జూలై 22: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ సంస్థ కెనరా బ్యాంక్.. ‘కెనరా ఏఐ1’ పేరుతో ఓ సరికొత్త మొబైల్ బ్యాంకింగ్ యాప్ను ఆవిష్కరించింది. శుక్రవారం ఈ సూపర్ యాప్ను బ్యాంక్ ఎండీ, సీఈవో ఎల్వీ ప్రభాకర్ ప్రారంభించారు. తమ ఖాతాదారుల అన్ని బ్యాంకింగ్ అవసరాలను తీర్చేలా ఈ యాప్ను రూపొందించామని, దీనిపై ఎంతో సురక్షితంగా లావాదేవీలు నిర్వహించుకోవచ్చని, 250కిపైగా సేవల్ని పొందవచ్చని ఈ సందర్భంగా కెనరా బ్యాంక్ ఓ ప్రకటనలో స్పష్టం చేసింది. కాగా, ‘అన్నివేళల్లో ప్రతి ఒక్కరికీ ప్రతీచోట ఈ-లావాదేవీలు’ అన్నదే బ్యాంక్ ప్రధాన దృక్పథమని బ్యాంక్ ఎండీ ప్రభాకర్ అన్నారు. ఈ యాప్ సేవలు 11 భాషల్లో అందుబాటులో ఉంటాయని వివరించారు. ఇక షాపింగ్, బిల్ పేమెంట్స్, విమాన/క్యాబ్/హోటల్ బుకింగ్స్ తదితర ఎన్నో సేవల్ని వినియోగదారులు సులభంగా పొందవచ్చన్నారు. అలాగే డిపాజిట్లు, రుణ చెల్లింపులు, మ్యూచువల్ ఫండ్, బీమా, డీమ్యాట్ సేవలు, 26ఏఎస్-అకౌంట్ స్టేట్మెంట్లు వంటి ఎన్నో సౌకర్యాలను అందుకోవచ్చన్నారు.