కేంద్ర ప్రభుత్వ రంగ బ్యాంక్ కెనరా బ్యాంక్ వివిధ రుణాలపై మళ్లీ కీలక వడ్డీరేట్లు పెంచేసింది. ఇంటి రుణాలతోపాటు అన్ని రకాల రుణాలపై మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేట్ (ఎంసీఎల్ఆర్), రెపో లింక్డ్ లెండింగ్ రేట్ (ఆర్ఎల్ఎల్ఆర్) పెంచింది. గురువారం ( 2022 జూలై 7) నుంచి పెరిగిన వడ్డీరేట్లు అమల్లోకి వచ్చాయని బీఎస్ఈ ఫైలింగ్‌లో తెలిపింది.
అన్ని రకాల రుణాలపై కెనరా బ్యాంక్ ఎంసీఎల్ఆర్ 10 బేసిక్ పాయింట్లు పెంచింది. దీంతో ఓవర్‌నైట్ నుంచి నెల రోజు గడువు గల రుణంపై ఎంసీఎల్ఆర్ ఇప్పుడు 6.75 శాతంగా ఉంటుంది. మూడు నెలల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.05 శాతం, ఆరు నెలల గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.45 శాతం, ఒక ఏడాది గడువు గల రుణాలపై ఎంసీఎల్ఆర్ 7.50 శాతానికి పెరుగుతున్నట్లు తెలిపింది.
అన్ని రకాల రిటైల్ రుణ పథకాలపై వడ్డీరేటును రెపో లింక్డ్ లెండింగ్ రేటు (ఆర్ఎల్ఎల్ఆర్) 50 బేసిక్ పాయింట్లు అని పేర్కొంది. దీంతో కెనరా బ్యాంక్ ఆర్ఎల్ఎల్ఆర్ 7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచుతున్నట్లు వివరించింది.