న్యూఢిల్లీ, జూలై 6:ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్..మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్ బేస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 10 బేసిస్ పాయింట్లు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. పెరిగిన వడ్డీరేటు గురువారం నుంచి అమలులోకి రానున్నట్లు బ్యాంక్ వెల్లడించింది. బ్యాంక్ తీసుకున్న తాజా నిర్ణయంతో వాహన, వ్యక్తిగత, గృహ రుణాలపై వడ్డీరేటు మరింత పెరగనున్నది. అత్యధిక మంది తీసుకునే ఏడాది కాలపరిమితి కలిగిన రుణాలపై వడ్డీరేటు 7.50 శాతానికి చేరుకున్నది. పెంచకముందు ఇది 7.40 శాతంగా ఉన్నది. వీటితోపాటు ఒక్కరోజు నుంచి ఆరు నెలల లోపు రుణాలపై వడ్డీరేటు 6.75 శాతం నుంచి 7.45 శాతం మధ్యలో ఉన్నాయి. దీంతోపాటు రెపో లింక్డ్ లెండింగ్ రేటు(ఆర్ఎల్ఎల్ఆర్)ని కూడా 7.30 శాతం నుంచి 7.80 శాతానికి పెంచింది. ఈ రేటు కూడా గురువారం నుంచి అమలులోకి రానున్నది.