Canara Bank | న్యూఢిల్లీ, ఆగస్టు 9: ప్రభుత్వరంగ సంస్థ కెనరా బ్యాంక్ రుణ గ్రహీతలకు షాకిచ్చింది. మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటు(ఎంసీఎల్ఆర్)ని 5 బేసిస్ పాయింట్లు పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతో అన్ని రకాల రుణాలపై వడ్డీరేట్లు అధికంకానున్నాయి. అత్యధిక మంది తీసుకునే ఏడాది కాలపరిమితితో వాహన, వ్యక్తిగత రుణాలపై వడ్డీరేటు 8.95 శాతం నుంచి 9 శాతానికి సవరించింది.
అలాగే మూడేండ్ల రుణాలపై రేటును 9.40 శాతానికి పెంచిన బ్యాంక్.. రెండేండ్ల రుణాలపై వడ్డీరేటును 9.30 శాతానికి పెంచింది. వీటితోపాటు నెల, మూడు, ఆరు నెలల రుణాలపై వడ్డీరేటు 8.35 శాతం నుంచి 8.80 శాతం మధ్యలో ఉంచింది. పెంచిన వడ్డీరేట్లు ఈ నెల 12 నుంచి అమలులోకి రానున్నట్లు పేర్కొంది.
బ్యాంక్ ఆఫ్ బరోడా(బీవోబీ) కూడా తన ఎంసీఎల్ఆర్ రేటును ఐదు బేసిస్ పాయింట్లు సవరించింది. ఈ నెల 12 నుంచి అమలులోకి వచ్చేలా ఎంపిక చేసిన కాలపరిమితులపై ఎంసీఎల్ఆర్ని పెంచింది. ఒక్కరోజు, నెల రుణాలపై వడ్డీరేట్లను యథాతథంగా ఉంచిన బ్యాంక్..మూడు, ఆరు నెలల, ఏడాది కాలపరిమితి రుణాలపై ఎంసీఎల్ఆర్ని పెంచింది.
దీంతో ఏడాది రుణాలపై ఎంసీఎల్ఆర్ రేటు 8.90 శాతం నుంచి 8.95 శాతానికి చేరుకున్నది. అలాగే యూకో బ్యాంక్ కూడా ఈ నెల నుంచి అమలులోకి వచ్చేలా ఎంసీఎల్ఆర్ని పెంచింది. దీంతో రోజు, నెల, మూడు, ఆరు నెలలు, ఏడాది రుణాలపై వడ్డీరేటు 8.20 శాతం నుంచి 8.95 శాతం మధ్యలో వసూలు చేస్తున్నది.