న్యూఢిల్లీ, జూన్ 18: కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్లో రూ.7,000 కోట్లదాకా పెట్టుబడులకు కెనడా పెన్షన్ ప్లాన్ ఇన్వెస్ట్మెంట్ బోర్డు (సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్) ముందుకొచ్చింది. ఈ మేరకు జరిగిన ఓ భాగస్వామ్య ఒప్పందం ప్రకారం హైదరాబాద్ కేంద్రంగా నడుస్తున్న కంట్రోల్ఎస్లో రూ.4,000 కోట్లతో 8.2 శాతం వాటాను సీపీపీ ఇన్వెస్ట్మెంట్స్ దక్కించుకోనున్నది. అలాగే మరో రూ.3,000 కోట్లదాకా పెట్టుబడులతో దేశవ్యాప్తంగా హైపర్‌స్కేల్ డాటా సెంటర్ క్యాంపస్‌ల అభివృద్ధికిగాను ఓ జాయింట్ వెంచర్‌ను ఇరు సంస్థలు ఏర్పాటు చేయనున్నాయి. సంస్థ విలువను రూ.44,914 కోట్లుగా తేల్చి ఈ లావాదేవీ జరుగుతున్నది.
కాగా, ఈ జాయింట్ వెంచర్లో సీపీపీ 48 శాతం, కంట్రోల్ఎస్ 52 శాతం వాటాలను కలిగి ఉంటాయని ఓ తాజా ప్రకటన పేర్కొన్నది. ఇక కేవలం వ్యాపార విస్తరణ కోసమే సీపీపీ ఇన్వెస్ట్‌మెంట్స్‌తో కలిసి ముందుకెళ్లట్లేదని, ఏఐ-రెడీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఓ బెంచ్‌మార్క్‌ను సిద్ధం చేయడానికి కూడా అని ఈ సందర్భంగా కంట్రోల్ఎస్ డాటాసెంటర్స్ వ్యవస్థాపక సీఈవో శ్రీధర్ పిన్నపురెడ్డి తెలిపారు. 2007లో మొదలైన ఈ సంస్థ 19 డాటాసెంటర్లను నిర్వహిస్తున్నది. వీటి మొత్తం సామర్థ్యం 370 మెగావాట్లపైనే. ఈ క్రమంలో దేశీయంగానేగాక, విదేశాల్లోనూ విస్తరించే దిశగా కంట్రోల్ఎస్ దూసుకుపోతున్నది.