న్యూఢిల్లీ, జూలై 27: నిధుల కొరతను ఎదుర్కొం టున్న ప్రభుత్వ రంగ టెలికం సంస్థ భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్ (బీఎస్ఎన్ఎల్)కు రూ.1,64,156 కోట్ల పునరుద్ధరణ ప్యాకేజీకి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. నాలుగేండ్లకుపైగా సాగనున్న ఈ సాయంలో రూ.43,964 కోట్ల నగదు ప్యాకేజీ, రూ.1.2 లక్షల కోట్ల నగదేతర ప్యాకేజీలున్నాయని టెలికం, ఐటీ శాఖల మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఇక్కడ విలేఖరులకు తెలిపారు.
ఇక 4జీ సేవలకు వీలుగా 900/1800 మెగాహెట్జ్ బ్యాండ్‌లో రూ.44,993 కోట్ల విలువైన స్పెక్ట్రం కేటాయింపునకూ కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, సర్వీస్ అప్‌గ్రేడ్, కొత్త స్పెక్ట్రం, రుణభారం తగ్గించుకోవడం వంటివి ఈ ప్యాకేజీతో జరుగనున్నాయి. 4జీ టెక్నాలజీ అభివృద్ధి కోసం ప్రభుత్వం రూ.22,471 కోట్లు సమకూర్చుతుందని ఈ సందర్భంగా మంత్రి వైష్ణవ్ తెలియజేశారు. అలాగే 2014-15 నుంచి 2019-20 వరకు వాణిజ్యపరంగా ఆచరణసాధ్యం కానప్పటికీ గ్రామీణ వైర్‌లైన్ కార్యకలాపాలను నిర్వహించినందుకుగాను వయబిలిటి-గ్యాప్ ఫండింగ్‌గా రూ.13,789 కోట్లు బీఎస్ఎన్ఎల్కు ఇవ్వనున్నారు. 2019లోనూ బీఎస్ఎన్ఎల్కు రూ.74,000 కోట్ల సాయం కేంద్రం నుంచి అందిన సంగతి విదితమే.
బీబీఎన్ఎల్ విలీనం
భారత్ బ్రాడ్‌బాండ్ నెట్వర్క్ లిమిటెడ్ (బీబీఎన్ఎల్)ను బీఎస్ఎన్ఎల్లో విలీనం చేయాలని కూడా నిర్ణయించారు. ఈ విలీనం ద్వారా బీఎస్ఎన్ఎల్ ఫైబర్ నెట్‌వర్క్‌ను బలోపేతం చేయాలని చూస్తున్నారు. ఇదిలావుంటే సంస్థకున్న రూ.33,404 కోట్ల చట్టబద్ధ బకాయిలు ఈక్విటీలోకి మారనున్నాయి. తద్వారా బీఎస్ఎన్ఎల్ బ్యాలెన్స్ షీట్‌పై ఒత్తిడిని తగ్గించనున్నారు. ఇక ప్రస్తుత రుణాల చెల్లింపునకు నిధుల సమీకరణ కోసం సార్వభౌమ హామీ సదుపాయాన్ని ప్రభుత్వం కల్పించనున్నది. కాగా, దేశవ్యాప్తంగా మారుమూల పల్లెలకూ 4జీ మొబైల్ సేవలను అందుబాటులోకి తెచ్చేందుకు రూ.26,316 కోట్ల వ్యయంతో ఓ ప్రాజెక్టుకు సైతం కేంద్ర క్యాబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో మారుమూల, కొండ, అటవీ ప్రాంతాల్లోని 24,680 గ్రామాలకు 4జీ సేవలు అందుబాటులోకి వస్తాయని మంత్రి వైష్ణవ్ చెప్పారు.
2 ఏండ్లలో 5జీ సేవలు
వచ్చే ఏడాదిన్నర-రెండేండ్లలో బీఎస్ఎన్ఎల్ 5జీ సేవలు మొదలవుతాయని మంత్రి వైష్ణవ్ చెప్పారు. అలాగే ఏడాది-ఏడాదిన్నరలో 4జీ సేవల విస్తరణ పూర్తికాగలదన్నారు. ఈ క్రమంలోనే రాబోయే 3-4 ఏండ్లలో సంస్థ లాభాల బాట పడుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. కాగా, ఎంటీఎన్ఎల్, బీఎస్ఎన్ఎల్ విలీనంపై స్పందిస్తూ ఇప్పటికీ ఆ ఆలోచన ఉందని, అయితే సంక్లిష్ట ఆర్థిక పునర్నిర్మాణ అవసరం ఉందని అభిప్రాయపడ్డారు.