న్యూఢిల్లీ, అక్టోబర్ 17: ప్రముఖ ఎడ్టెక్ కంపెనీ బైజూస్ విలువ ఇప్పుడేమీ లేదని ఆ సంస్థ వ్యవస్థాపకుడు రవీంద్రన్ అన్నారు. గురువారం వర్చువల్‌గా జరిగిన విలేకరుల సమావేశంలో బైజూస్ మళ్లీ పుంజుకుంటుందా? అన్న ప్రశ్నకుగాను బైజూస్ విలువ ప్రస్తుతం సున్నా అని ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. గత ఏడాది ఒకేసారి బైజూస్ ప్రధాన ఇన్వెస్టైర్లెన ప్రోసుస్, పీక్ ఎక్స్‌వీ పార్ట్నర్స్, చాన్ జూకర్బర్గ్ ఇనీషియేటివ్‌లు సంస్థ బోర్డు నుంచి వైదొలగడం పెద్ద దెబ్బగా రవీంద్రన్ అభివర్ణించారు. ఈ క్రమంలోనే నిధుల సమీకరణ అసాధ్యంగా మారిందని చెప్పుకొచ్చారు. కరోనా సమయంలో ఆన్లైన్ బోధనా మాధ్యమంగా వేగంగా విస్తరించిన బైజూస్..
అత్యంత విలువైన భారతీయ స్టార్టప్ ఘనతను సాధించింది. అయితే మళ్లీ విద్యా రంగంలో సాధారణ పరిస్థితులు రావడం, ఆన్లైన్ చదువులకు ఎవరూ ఆసక్తి చూపకపోవడంతో బైజూస్ సేవలకు డిమాండ్ కరువైంది. ఈ నేపథ్యంలోనే ప్రోసుస్ వంటి ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను నిరర్థకంగా ప్రకటించారు. ‘అమెరికాకు చెందిన రుణదాతలు సంస్థను ఎగవేతదారుగా ప్రకటించి, కోర్టుల్లో పిటీషన్లు దాఖలు చేసినప్పుడు రెండు వారాల వ్యవధిలోనే ముగ్గురు డైరెక్టర్లు కంపెనీకి రాజీనామా చేశారు. వారు తప్పుకున్నా.. సంస్థ పునర్వ్యవస్థీకరణ దిశగా అడుగులు వేస్తే కంపెనీకి నేడు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు’ అన్న అభిప్రాయాన్ని రవీంద్రన్ ఈ సందర్భంగా కనబర్చారు.