BYD Seal EV | ప్రముఖ కార్ల తయారీ సంస్థ బీవైడీ ఇండియా తన ఈవీ కారు సీల్ (Seal) ను మంగళవారం భారత్ మార్కెట్లో ఆవిష్కరించింది. గతేడాది ఆటో ఎక్స్ పోలో డిజైన్ ప్రదర్శించినా ఆవిష్కరణ ఆలస్యమైంది. రెండు బ్యాటరీ ప్యాక్ ఆప్షన్లలో బీవైడీ సీల్ లభిస్తుంది. 61.44 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ గల కారు డైనమిక్ రేంజ్, 82.56 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌తో ప్రీమియం రేంజ్, పెర్ఫార్మెన్స్ రేంజ్ వేరియంట్లలో అందుబాటులో ఉంది. రూ.1.25 లక్షల టోకెన్ సొమ్ము చెల్లించి కారు బుక్ చేసుకోవచ్చు.
డైనమిక్, ప్రీమియం రేంజ్ వేరియంట్ కార్లు రేర్ వీల్ డ్రైవ్ పవర్ ట్రైన్, పెర్ఫార్మెన్స్ రేంజ్ వేరియంట్ ఆల్ వీల్ డ్రైవ్ పవర్ ట్రైన్ ఆప్షన్లతో వస్తున్నది. మూడు వేరియంట్లూ వేర్వేరు స్థాయి పవర్ ఔట్పుట్ వెలువరిస్తాయి. డైనమిక్ రేంజ్ రూ.41 లక్షలు, ప్రీమియం రేంజ్ రూ.45.55 లక్షలు, పెర్ఫార్మెన్స్ రేంజ్ రూ.53 లక్షలు పలుకుతుంది. డైనమిక్ రేంజ్ కారు ఇంజిన్ గరిష్టంగా 201 బీహెచ్పీ విద్యుత్, 310 ఎన్ఎం టార్క్, ప్రీమియం రేంజ్ 308 బీహెచ్పీ విద్యుత్, 360 ఎన్ఎం టార్క్ వెలువరిస్తాయి.
డైనమిక్ రేంజ్ సింగిల్ చార్జింగ్‌తో 510 కి.మీ దూరం ప్రయాణిస్తుంది. 7.5 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగంతో ప్రయాణిస్తుంది. ప్రీమియం రేంజ్ కారు 5.9 సెకన్లలో గంటకు 100 కి.మీ వేగం అందుకుంటుండగా, సింగిల్ చార్జింగ్‌తో 650 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉంటుంది. పెర్ఫార్మెన్స్ వేరియంట్ సింగిల్ చార్జింగ్‌తో 580 కి.మీ దూరం ప్రయాణించే సామర్థ్యం కలిగి ఉండగా, 3.8 సెకన్లలోనే గంటకు 100 కి.మీ వేగంతో దూసుకెళ్తుంది.
బీవైడీ సీల్ ఈవీ కారు నాలుగు కలర్స్ -అరోరా వైట్, కాస్మోస్ బ్లాక్, అట్లాంటిస్ గ్రే, ఆర్టిక్ బ్లూ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. త్రీ-స్పోక్ మల్టీ ఫంక్షన్ స్టీరింగ్ వీల్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పనోరమిక్ సన్ రూఫ్, 360 డిగ్రీ కెమెరా, వెంటిలేటెడ్ సీట్స్, వైర్ లెస్ చార్జింగ్ ఫెసిలిటీ, లెవెల్ 2 అడాస్ సిస్టమ్ తదితర ఫీచర్లు ఉంటాయి.