న్యూఢిల్లీ, జూలై 3: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ వృద్ధిరేటు 6.4 శాతం నుంచి 6.7 శాతం మధ్యలో నమోదుకానున్నదని భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) అంచనావేస్తున్నది. అంతర్జాతీయ రాజకీయ అనిశ్చిత పరిస్థితులు నెలకొన్నప్పటికీ దేశీయంగా డిమాండ్ అధికంగా ఉన్నదని సీఐఐ నూతన ప్రెసిడెంట్ రాజీవ్ మెమానీ తెలిపారు. వస్తు సేవల పన్నులను హేతుబద్దీకరించడం, కీలక వస్తువులపై 5 శాతం జీఎస్టీ విధింపు, లగ్జరీ ఉత్పత్తులపై 28 శాతం, ఇతర ప్రొడక్ట్‌లపై 12-18 శాతంతో పన్ను విధిస్తున్నది. ప్రస్తుతం జీఎస్టీ 5, 12,18, 28 శాతం శ్లాబుల్లో విధిస్తున్నారు.
ఈసారి సాధారణం కంటే అధికంగా వర్షాలు కురిసే అవకాశం ఉండటం, రిజర్వుబ్యాంక్ నగదు నిల్వల నిష్పత్తిని తగ్గించడంతో మార్కెట్లో నిధుల ప్రవాహం పెరగడం, క్రమంగా ఆర్బీఐ వడ్డీరేట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయం వృద్ధికి ఊతమివ్వనున్నాయన్నారు. దీంతో 2025-26 ఆర్థిక సంవత్సరంలో జీడీపీ 6.4-6.7 శాతం మధ్యలో నమోదుకానున్నదని చెప్పారు. అయినప్పటికీ కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలున్నాయన్న ఆయన..బాహ్య ప్రపంచంతో వాణిజ్య ఒప్పందాలు తగ్గుముఖం పట్టడం ప్రతికూల ప్రభావం చూపే ఆస్కారం ఉన్నదని చెప్పారు.
జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులతోపాటు విద్యుత్, రియల్ ఎస్టేట్, ఆల్కహాల్‌ను కూడా తీసుకురావాలని ఆయన సూచించారు. తద్వారా దేశవ్యాప్తంగా ధరలు ఒకేస్థాయికి దిగిరానున్నట్లు చెప్పారు. మరిన్ని ఆర్థిక సంస్కరణలకు శ్రీకారం చుట్టాలని, తద్వారా భారీ పెట్టుబడులను ఆకట్టుకోవడానికి వీలు పడనున్నదన్నారు.