Omicron on Wedding Season | కరోనా న్యూవేరియంట్ ఒమిక్రాన్ కేసులు ప్రభావం నిత్యావసర వస్తువుల కొనుగోళ్లతోపాటు వ్యాపార లావాదేవీలపై బాగానే పడుతోంది. పది రోజులుగా దేశవ్యాప్తంగా వివిధ రకాల సరుకుల కొనుగోళ్లు సగటున 45 శాతం పడిపోయాయని అఖిల భారత వ్యాపారుల సంఘం (కెయిట్) ఆందోళన వ్యక్తం చేసింది. పరిస్థితులు ఇలాగే కొనసాగితే, వచ్చే పెండ్లిండ్ల సీజన్లో ప్రధాన వ్యాపార లావాదేవీలు దెబ్బ తింటాయని అంచనా వేస్తున్నామని తెలిపింది. మకర సంక్రాంతి నుంచి వచ్చే రెండున్నర నెలల పాటు వివాహాల సీజన్లో రూ.4 లక్షల కోట్ల బిజినెస్ జరుగుతుందని అంచనా వేస్తున్నట్లు కెయిట్ వ్యాఖ్యానించింది. కరోనా కేసులు పెరిగిపోవడం వల్ల వచ్చే రెండున్నర నెలల్లో బిజినెస్లు రూ.1.25 లక్షల కోట్లకు పడిపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేసింది.
కరోనా కేసులు పెరుగుతుండటంతో పొరుగు నగరాల నుంచి డిస్ట్రిబ్యూషన్ సెంటర్లకు రావడానికి వ్యాపారులు నిరాసక్తత వ్యక్తం చేస్తున్నారు. నగదు కొరత, వ్యాపారులతో సంప్రదించకుండానే కోవిడ్ ఆంక్షలు విధించడంతో భారీ మొత్తంలో క్రెడిట్ పొందే అవకాశాలు నిలిచిపోతున్నాయని కెయిట్ తెలిపింది.
కరోనా కేసులను అరికట్టేందుకు కేంద్ర ప్రభుత్వం, వివిధ రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన ఆంక్షలు వ్యాపార లావాదేవీలపై తీవ్రంగా ఉందని పేర్కొన్నది. ఆంక్షల వల్ల వివిధ ప్రాంతాల మధ్య వ్యాపారం, స్థానిక కొనుగోళ్లకు జంట సవాళ్లుగా మారాయని తెలిపింది. థర్డ్ వేవ్ ప్రభావంతో ప్రజల్లో ఆందోళన పెరిగిపోవడమే దీనికి కారణం అని వెల్లడించింది. ఈ నేపథ్యంలో కరోనా వ్యాపించకుండా కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాల ముఖ్యమంత్రులు అవసరమైన చర్యలు తీసుకోవాలని కెయిట్ అభ్యర్థించింది.