Income Tax | వచ్చే ఆర్థిక సంవత్సరా (2025-26)నికి వార్షిక బడ్జెట్‌ను ఫిబ్రవరి ఒకటో తేదీన పార్లమెంట్‌కు సమర్పించేందుకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ సర్వ సన్నద్ధం అయ్యారు. ఎప్పటి మాదిరే వేతన జీవులు ఆదాయం పన్ను చట్టంలో మినహాయింపులు పెంచుతారని ఆశిస్తున్నారు. అయితే భారతీయ స్టేట్ బ్యాంక్ (ఎస్బీఐ).. కేంద్ర ప్రభుత్వానికి ప్రీ-బడ్జెట్ సిఫారసుల పేరిట కొన్ని ప్రతిపాదనలు చేసింది. పాత ఆదాయం పన్ను విధానంలోని మినహాయింపులను దశల వారీగా తొలగిస్తూ ఆదాయం పన్ను చెల్లింపు వ్యవస్థను సంఘటితం చేయాలని సూచించింది. మొత్తం 8.2 కోట్ల మంది పన్ను చెల్లింపుదారులను నూతన ఆదాయం పన్ను విధానంలోకి తీసుకురావాలని ప్రతిపాదించింది.
2024జూలైలో 2024-25 ఆర్థిక సంవత్సరానికి పూర్తిస్థాయి బడ్జెట్ సమర్పిస్తూనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్.. 1961-ఆదాయం పన్ను చట్టాన్ని సమగ్రంగా సమీక్షించి ఆధునీకరిస్తామని, టాక్స్ ఫ్రేమ్‌వర్క్‌ను సరళతరం చేస్తామని ప్రకటించారు. ఈ నెల 31 నుంచి ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల్లోనే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కొత్త ఆదాయం పన్ను చట్టాన్ని పార్లమెంట్‌కు సమర్పిస్తారని వార్తలొస్తున్నాయి.
ఒకవైపు ప్రత్యక్షంగా ఆదాయం పన్ను చెల్లిస్తూ, మరోవైపు అధిక జీఎస్టీ రేట్లు చెల్లించాల్సి వస్తున్నదని మధ్య తరగతి పన్నుచెల్లింపుదారులు అంటున్నారు. ఇది అసమానతలకు దారి తీస్తుందని చెబుతున్నారు. పట్టణాల్లో ఆహార వస్తువుల ధరలు ప్రజల డిస్పోజబుల్ ఇన్‌కం హరించేస్తాయి. ఫలితంగా ప్రయివేట్ వస్తువుల వినియోగం తగ్గుతుంది. తాత్కాలికంగా ఆదాయం నష్టపోయినా దీర్ఘకాలికంగా ప్రభుత్వ ఖాజానకు మేలు జరుగుతుందని ఎస్బీఐ ప్రీ – బడ్జెట్ సూచనల్లో పేర్కొంది.