Union Budget | న్యూఢిల్లీ, జనవరి 31: కేంద్ర బడ్జెట్ అనగానే యావత్తు దేశంలోని అన్ని రంగాలూ ఎన్నో ఆశలు పెట్టుకుంటాయి. ముఖ్యంగా వ్యాపార, పారిశ్రామిక వర్గాలు, వేతన జీవుల నుంచి డిమాండ్లు కోకొల్లలు. అయితే ఈసారి వస్తున్నది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. లోక్‌సభ ఎన్నికలకు ముందు తాత్కాలిక పద్దును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గురువారం పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. దీంతో పెద్దగా ప్రకటనలేవీ ఉండబోవన్న అంచనాల మధ్య ఆశావహుల్లో ఒక్కసారిగా నీరసం నెలకొంటున్నది. అయినప్పటికీ ఎన్నికల దృష్ట్యా మోదీ సర్కారు ఏవైనా తాయిలాలు అందిస్తుందేమోనన్న ఊహాగానాలూ వినిపిస్తున్నాయి. కానీ ఇప్పటికే ఆదాయ పన్నుల వంటి వాటి జోలికి వెళ్లే అవకాశాల్లేవని మంత్రి నిర్మలా సీతారామన్ సంకేతాలిచ్చారు. అయినా పన్ను శ్లాబులు, రేట్లను సవరించాలన్న డిమాండ్లు మాత్రం వస్తూనే ఉన్నాయి. అందరికీ బీమాతోపాటు పొదుపునకు పెద్దపీట వేసేలా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహకాలు, చర్యలను అంతా ఆశిస్తున్నారు.
ఆతిథ్య రంగాన్ని ఉత్సాహపర్చేలా బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ఏవైనా నిర్ణయాలు తీసుకుంటుందా? అన్న కోణంలో హోటల్స్ యాజమాన్యాలు ఎదురుచూస్తున్నాయి. పర్యాటకుల్ని ఆకట్టుకునేలా మౌలిక సదుపాయాల కల్పనకు నిధులను కేటాయించాలని హిల్టన్ గోవా జనరల్ మేనేజర్ అమన్‌దీప్ సింగ్ గ్రోవర్ అంటున్నారు. ద్రవ్యోల్బణం కారణంగా టూరిస్టులు వెనుకడుగు వేస్తున్నారని, వ్యయ భారం నుంచి ఊరట లభించేలా ప్రభుత్వం వైపు నుంచి చర్యలుంటే బాగుంటుందని హయత్ సెంట్రిక్ జనరల్ మేనేజర్ శిల్పి ఖన్నా అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా కరోనా సమయంలో ఆతిథ్య రంగం తీవ్ర నష్టాలను చవిచూసిందని గుర్తుచేశారు. ఇప్పటికీ వాటిని భర్తీ చేసుకోలేకపోతున్నామని వాపోయారు. లీవ్ ట్రావెల్ అలవెన్సు (ఎల్‌టీఏ)లపై పన్నులను తొలగించాలని కోరుతున్నారు.
ఈ మధ్యంతర బడ్జెట్లోనూ మూలధన వ్యయంపై కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని నీతి ఆయోగ్ మాజీ వైస్ చైర్మన్ రాజీవ్ కుమార్ అన్నారు. ప్రైవేట్ పెట్టుబడులు ఇంకా బలహీనంగానే ఉన్నాయని, వీటిలో జోష్ పెరిగితేనే భారత ఆర్థిక వ్యవస్థకూ ఉత్సాహం వస్తుందని అభిప్రాయపడ్డారు.
ఈ ఆర్థిక సంవత్సరానికి (2023-24)గాను కేంద్ర ప్రభుత్వం ద్రవ్యలోటును రూ.17.86 లక్షల కోట్లుగా నిర్దేశించుకున్నది. దేశ జీడీపీలో ఇది 5.9 శాతాన్ని మించవద్దనుకున్నది. అయితే ఇందులో 55 శాతం నిరుడు డిసెంబర్ ఆఖరు నాటికి నమోదైందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ (సీజీఏ) బుధవారం తెలియజేసింది. గత ఏడాది ఏప్రిల్-డిసెంబర్ మధ్య ప్రభుత్వ ఖర్చులు రూ.30.54 లక్షల కోట్లుగా ఉన్నాయి. ఆదాయం రూ.20.71 లక్షల కోట్లుగా ఉన్నది. దీంతో ద్రవ్యలోటు రూ.9.83 లక్షల కోట్లుగా నమోదైంది. నిర్దేశిత రూ.17.86 లక్షల కోట్లలో ఈ మొత్తం 55 శాతానికి సమానంగా ఉన్నట్టు సీజీఏ ప్రకటించారు. ప్రభుత్వ ఆదాయాన్ని మించి వ్యయాలుంటే వాటి మధ్య ఉన్న వ్యత్యాసాన్నే ద్రవ్యలోటుగా పరిగణిస్తారన్న విషయం తెలిసిందే.