శనివారం 04 ఏప్రిల్ 2020
Business - Jan 30, 2020 , 00:01:58

ఉద్దీపనలే ఊపిరి

ఉద్దీపనలే ఊపిరి
  • ఆర్థిక మందగమనానికి చెక్‌పెట్టే నిర్ణయాలు
  • మౌలిక రంగానికి భారీగా కేటాయింపులు
  • ఐటీ కోతలతో వినియోగ సామర్థ్యం పెంచే యోచన
  • పెట్టుబడులకు ఊతమిచ్చే చర్యలు
  • బడ్జెట్‌పై నిపుణుల అంచనాలు

న్యూఢిల్లీ, జనవరి 29:దేశ ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న మందగమనాన్ని పారద్రోలేందుకు రాబోయే బడ్జెట్‌లో మౌలిక రంగానికి పెద్ద ఎత్తున కేటాయింపులు ఉండవచ్చని సమాచారం. మార్కెట్‌లో వినియోగ డిమాండ్‌ను పెంచడానికి కస్టమర్ల కొనుగోలు సామర్థ్యం బలపరుచడానికీ మోదీ సర్కారు చర్యలు చేపట్టనున్నట్లు తెలుస్తున్నది. ఇందుకనుగుణంగా ఆదాయం పన్ను (ఐటీ) కోతలకు వీలుందని నిపుణులు అంటున్నారు. ఇక స్తంభించిన పెట్టుబడులను తిరిగి ఉత్తేజపరిచేందుకూ కేంద్రం పలు నిర్ణయాలు తీసుకోవచ్చని అభిప్రాయపడుతున్నారు. దశాబ్దకాలంలో ఎన్నడూలేనంతగా భారత ఆర్థిక వ్యవస్థ మందగించిన విషయం తెలిసిందే. ఈ ఆర్థిక సంవత్సరం (2019-20) రెండో త్రైమాసికం (జూలై-సెప్టెంబర్‌)లో దేశ వృద్ధిరేటు ఆరేండ్ల కనిష్ఠాన్ని తాకుతూ 4.5 శాతంగా నమోదైన సంగతి విదితమే. ఏటేటా ఉద్యోగావకాశాలు పడిపోతుండటాన్నీ చూస్తూనే ఉన్నాం. ఈ క్రమంలోనే ఆర్థిక వ్యవస్థలో నూతనోత్తేజం తీసుకురావడానికి కార్పొరేట్‌ పన్నుల్లో కేంద్ర ప్రభుత్వం కోతలు పెట్టినా ఫలితం లేకపోయింది. రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) వరుస వడ్డీరేట్ల తగ్గింపులూ జీడీపీకి లాభించలేకపోయాయి. నిజానికి దేశ ఆర్థిక వ్యవస్థ క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా.. పౌరసత్వం బిల్లుపై ప్రభుత్వ వ్యతిరేక ప్రజా ఆందోళనల్ని అరికట్టడానికే మోదీ సర్కారు ఎక్కువ సమయాన్ని ఖర్చు చేసింది. దీంతో వృద్ధిరేటు కాస్తా పడకేయగా.. బడ్జెట్‌తో దీన్ని మేల్కొలుపాలని సర్కారు ప్రయత్నిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరానికి (2020-21)గాను ఫిబ్రవరి 1న పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టనున్నారు.

వృద్ధిదాయక బడ్జెట్‌ కావాలి.. 

బలహీనపడిన దేశ ఆర్థిక వ్యవస్థ, పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేక నిరసనలు.. బడ్జెట్‌లో ఆర్థిక ఉద్దీపనలకున్న అవకాశాలను మెరుగుపరుస్తున్నాయని సింగపూర్‌కు చెందిన క్యాపిటల్‌ ఎకనామిక్స్‌లోని ఆర్థికవేత్త షిలాన్‌ షా అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీ 4.8 శాతానికే పరిమితం కావచ్చని అంతర్జాతీయ ద్రవ్య నిధి (ఐఎంఎఫ్‌) ఇటీవలే అంచనా వేసింది. అంతకుముందు అంచనా కంటే ఇది తక్కువ కావడం గమనార్హం. ప్రపంచ బ్యాంక్‌తోపాటు దేశ, విదేశీ రేటింగ్‌ ఏజెన్సీలు, చివరకు ఆర్బీఐ, కేంద్ర ప్రభుత్వ అంచనాలూ ఈసారి జీడీపీ 5 శాతం దాటదనే చెబుతున్నాయి. దీంతో ఉద్దీపనలకు ఆస్కారముందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనివల్ల రాబోయే త్రైమాసికాల్లో జీడీపీని బలపరిచినట్లవుతుందని అంటున్నారు. వచ్చే ఆర్థిక సంవత్సరానికి జీడీపీలో ద్రవ్యలోటును 3.6 శాతం వద్ద కట్టడి చేయాలని మోదీ సర్కారు లక్ష్యంగా పెట్టుకోవచ్చని నిపుణులు అంటున్నారు. ఈ ఆర్థిక సంవత్సరం లక్ష్యం 3.3 శాతంగా ఉన్నది.

మౌలికం కీలకం

2024-25 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థను 5 లక్షల కోట్ల డాలర్లకు చేర్చాలన్న లక్ష్య సాధన కోసం వచ్చే ఐదేండ్లలో 105 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడుల ప్రణాళికను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేసిన విషయం తెలిసిందే. దీనికి రాబోయే బడ్జెట్‌లో పెద్ద ఎత్తున కేటాయింపులు ఉండవచ్చని ప్రభుత్వ వర్గాల సమాచారం. ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ విలువ 2.8 లక్షల కోట్ల డాలర్లు. 2014లో కేంద్రంలో అధికారాన్ని చేపట్టిన దగ్గర్నుంచి మోదీ సర్కారు.. రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవుల నిర్మాణానికి పెద్దపీట వేస్తున్నది. ఈ క్రమంలో ప్రైవేట్‌ సంస్థల భాగస్వామ్యంతో మరింతగా వీటి నిర్మాణాలకు ముందుకెళ్ళాలని కేంద్రం యోచన. దీనివల్ల ఇటు మౌలిక సదుపాయాల కల్పన, అటు ఉద్యోగావకాశాల సృష్టి ఉంటుందని సర్కారు గట్టి నమ్మకం. మరోవైపు పన్నుల ఆదాయం తగ్గి బక్కచిక్కిపోతున్న ఖజానాకు దన్నుగా ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణకూ కేంద్రం ప్రయత్నిస్తున్నది. వచ్చే ఆర్థిక సంవత్సరం ఎలాగైనా ఎయిర్‌ ఇండియా, భారత్‌ పెట్రోలియం కార్పొరేషన్‌, మరికొన్ని సంస్థలను ప్రైవేటీకరించాలని చూస్తున్నది. అలాగే దిగుమతి సుంకాలను పెంచి దేశీయంగా తయారీకి ఊతమివ్వాలని కూడా కేంద్ర ప్రభుత్వం చూస్తున్నది.


logo