BSNL | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14 : ప్రభుత్వరంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ ఎట్టకేలకు లాభాల్లోకి వచ్చింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను సంస్థ రూ.262 కోట్ల లాభాన్ని ఆర్జించింది. 17 ఏండ్ల తర్వాత తొలిసారిగా సంస్థ లాభాలను ఆర్జించడం విశేషమని కేంద్ర మంత్రి జ్యోతిరాధిత్యా సింధియా తెలిపారు. వ్యాపారాన్ని మరింత విస్తరించడంతోపాటు చందాదారులను పెంచుకోవడం వల్లనే ఇది సాధ్యమైందన్నారు. జూన్ త్రైమాసికంలో 8.4 కోట్ల మంది సబ్స్ర్కైబర్లు ఉండగా, అదే డిసెంబర్ చివరినాటికి ఈ సంఖ్య 9 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు.
మొబిలిటీ సేవలు అందించడంతో వచ్చిన ఆదాయంలో 15 శాతం వృద్ధి నమోదుకాగా, అలాగే ఫైబర్-టూ-ది-హోమ్(ఎఫ్టీటీహెచ్) ఆదాయంలో 18 శాతం పెరుగుదల కనిపించింది. మరోవైపు, ఆర్థిక చెల్లింపులు, నిర్వహణ ఖర్చులు రూ.1,800 కోట్లకు తగ్గించుకోగలిగింది. 4జీ సర్వీసులను విస్తరించడానికి దేశవ్యాప్తంగా లక్ష టవర్లను ఏర్పాటు చేయడంలో భాగంగా ఇప్పటి వరకు 75 వేల టవర్లను ఇన్స్టాల్ చేసినట్లు, వీటిలో 60 వేల టవర్లు అందుబాటులోకి వచ్చాయని మంత్రి చెప్పారు. ఈ ఏడాది జూన్ నాటికి లక్ష టవర్లు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నదన్నారు.