న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ప్రభుత్వ రంగ టెలికం సంస్థ బీఎస్ఎన్ఎల్ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ (సీఎండీ) పీకే పుర్వర్పై ఉద్యోగులు నిరసన గళం ఎత్తారు. పుర్వర్ను తొలగించాలంటూ ఆందోళనల్ని చేపట్టాలని సంస్థ ఉద్యోగ సంఘాలు నిర్ణయించాయి. ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన సంస్థను కాపాడటంలో పుర్వర్ విఫలమయ్యారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ నెల 26న తమ డిమాండ్లతో నల్ల జెండా, నల్ల బ్యాడ్జీలతో నిరసనలకు దిగనున్న ఉద్యోగులు.. పుర్వర్ను తీసేయాలనీ ఆందోళన చేయనున్నారు.
గత నెల 27న జారీ చేసిన ఓ సర్క్యులర్‌లోనే ఈ మేరకు బీఎస్ఎన్ఎల్కు చెందిన అన్ని ఉద్యోగ యూనియన్లు, అసోసియేషన్లు (ఏయూఏబీ) స్పష్టం చేశాయి. బుధవారం నుంచి పుర్వర్ తొలగింపు డిమాండ్‌తో సామాజిక మాధ్యమాల్లో ప్రచారాన్ని కూడా ఏయూఏబీ ప్రారంభించనున్నది. 2019లో సంస్థ పునరుద్ధరణ కోసం కేంద్ర ప్రభుత్వం ఓ ప్యాకేజీని అందించినా, దాన్ని సద్వినియోగం చేసుకోవడంలో యాజమాన్యం విఫలమైందని ఉద్యోగ సంఘాలు దుయ్యబడుతున్నాయి. 4జీ సేవలనూ అందుబాటులోకి తేలేకపోయారన్నాయి. దీనంతటికీ కారణం పుర్వర్ వైఫల్యమైనంటూ ఆయన్ను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి.