న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: ధరలకు బ్రేక్‌పడింది. వరుసగా ఎనిమిది రోజులుగా ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన అతి విలువైన లోహాల ధరల దిద్దుబాటుకు గురయ్యాయి. దీంతో న్యూఢిల్లీ బులియన్ మార్కెట్లో 99.9 శాతం స్వచ్ఛత కలిగిన పదిగ్రాముల బంగారం ధర రూ.1,000 తగ్గి రూ.1,06,070కి దిగొచ్చింది. అంతకుముందు ధర రూ.1,07,070గా ఉన్నది. అలాగే 99.5 శాతం స్వచ్ఛత కలిగిన పుత్తడి ధర కూడా అంతే స్థాయిలో తగ్గి రూ.1,05,200గా నమోదైనట్టు ఆల్ ఇండియా సరఫా అసోసియేషన్ వెల్లడించింది.
బంగారంతోపాటు వెండి ధరలు కూడా దిగొచ్చాయి. అధిక ధరల కారణంగా పారిశ్రామిక వర్గాలు, నాణేల తయారీదారుల నుంచి డిమాండ్ పడిపోవడంతో కిలో వెండి రూ.500 తగ్గి రూ.1,25,600గా నమోదైంది. వెండి చారిత్రక గరిష్ఠ స్థాయి రూ.1,26,100 పలికిన విషయం తెలిసిందే. అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ పడిపోవడంతో దేశీయంగా ధరలు దిగొచ్చాయని బులియన్ ట్రేడర్ వెల్లడించారు. ఔన్స్ గోల్డ్ ధర ఒకేరోజు 39.61 డాలర్లు లేదా 1.10 శాతం తగ్గి 3,539.14 డాలర్లకు పడిపోయింది. బుధవారం రికార్డు స్థాయి 3,578.80 డాలర్లు పలికిన విషయం తెలిసిందే. అలాగే వెండి 40.93 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది.