TPG Nambiar | ప్రముఖ ఎలక్ట్రానిక్ కంపెనీ ‘బీపీఎల్ గ్రూప్’ ఫౌండర్ టీపీ గోపాలన్ నంబియార్ (94) గురువారం కన్నుమూశారని కుటుంబ వర్గాలు తెలిపాయి. కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధ పడుతున్నారు. గురువారం ఉదయం కన్నుమూశారని ఆ వర్గాలు వెల్లడించాయి. గోపాలన్ నంబియార్ ఉదయం 10.15 గంటలకు మరణించారని నంబియార్ కుటుంబ సభ్యుడు ఒకరు తెలిపారు. కేంద్ర మాజీ మంత్రి – బీజేపీ సీనియర్ నేత రీజావ్ చంద్రశేఖర్ మామ టీపీ గోపాలన్ నంబియార్. గోపాలన్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోదీ సంతాపం తెలిపారు. దేశీయంగా కన్జూమర్ బ్రాండ్ నెలకొల్పిన దార్శనికుడు దూరం అయ్యారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఎక్స్ లో పోస్ట్ పెట్టారు.
‘బీపీఎల్ గ్రూప్ ఫౌండర్ టీపీజీ నంబియార్ మరణం విచారకరం. సుదీర్ఘ కాలం నాకు అత్యంత సన్నిహితులు. దేశానికి ఆయన చేసిన సేవలు, వారసత్వం ఎల్లవేళలా గుర్తుండి పోతాయి. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాడ సంతాపం తెలుపుతున్నా’ అని బీజేపీ సీనియర్ నేత బీఎస్ యెడియూరప్ప ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.