న్యూఢిల్లీ, నవంబర్ 3: దేశీయ బ్యాంకింగ్ రంగ (Banking Industry) లాభాలు మున్ముందూ ఆశాజనకంగా ఉండకపోవచ్చన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఏడాది వరుస ద్రవ్యసమీక్షల్లో రెపోరేటును ఒక శాతం (100 బేసిస్ పాయింట్లు) తగ్గించిన నేపథ్యంలో ఆయా ప్రభుత్వ, ప్రైవేట్ రంగ బ్యాంకులూ రుణాలపై వడ్డీరేట్లను తగ్గించేశాయి. మరోవైపు డిపాజిట్లపై మాత్రం వడ్డీరేట్లు ఆ స్థాయిలో తగ్గలేదు. నిరుడు డిసెంబర్ నుంచి రుణాలపై వడ్డీరేట్లు 50 బేసిస్ పాయింట్లు తగ్గితే.. డిపాజిట్లపై 30 బేసిస్ పాయింట్లే తగ్గాయి. బ్యాంకుల మధ్య నెలకొన్న తీవ్ర పోటీ ఇందుకు కారణమవగా.. లాభాలపై ఈ ప్రభావం స్పష్టంగా కనిపిస్తున్నదిప్పుడు. ఈ ఆర్థిక సంవత్సరం జూలై-సెప్టెంబర్కుగాను వివిధ బ్యాంకులు ప్రకటిస్తున్న ఆర్థిక ఫలితాలు ఇందుకు నిదర్శనంగా చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఆఫ్ బరోడా (8.2 శాతం), బంధన్ బ్యాంక్ (88 శాతం), యాక్సిస్ బ్యాంక్ (26 శాతం), కొటక్ మహీంద్రా బ్యాంక్ (2 శాతం) లాభాలు గతంతో పోల్చితే నిరాశపర్చాయి. ప్రస్తుతం మెజారిటీ బ్యాంకు లు రుణాలపై ఫ్లోటింగ్ వడ్డీరేట్లను అమలు చేస్తున్నాయి. దీంతో ఆర్బీఐ పాలసీ రేటు ఆధారంగా ఇవీ తగ్గిపోయాయి. ఫలితంగా బ్యాంకుల రాబడులూ పడిపోతున్నాయి.
ఆర్బీఐ ఇంకా తగ్గిస్తే..
ద్రవ్యోల్బణం అదుపులో ఉంటే.. వృద్ధిరేటుకు పెద్దపీట వేస్తామని ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా గత ద్రవ్యసమీక్షలో చెప్పారు. దీన్నిబట్టి వచ్చే ద్రవ్యసమీక్షల్లో రెపోరేటు ఇంకా తగ్గేందుకు వీలున్నది. పైగా అమెరికా టారిఫ్లు, రూపాయి విలువ పతనం వంటివి.. దేశ జీడీపీకి తప్పక మద్దతివ్వాల్సిన అవసరాన్ని సృష్టిస్తున్నాయి. ఈ క్రమంలో బ్యాంకుల లాభాలు మరింతగా దిగజారవచ్చన్న అంచనాలైతే గట్టిగా వినిపిస్తున్నాయి.