Boeing Layoffs | ప్రముఖ విమానాల తయారీ సంస్థ బోయింగ్ (Boeing) భారీగా ఉద్యోగుల ఉద్వాసనకు రంగం సిద్ధం చేసింది. ఒకేసారి 17 వేల మంది ఉద్యోగులపై వేటు వేయనున్నది. ప్రపంచ వ్యాప్తంగా పని చేస్తున్న సిబ్బందిలో సుమారు 10 శాతం మందిని తొలగించడానికి బుధవారం నుంచి పింక్ స్లిప్‌లు జారీ చేస్తున్నట్లు తెలిపింది. ప్రస్తుతం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక ఒత్తిళ్లు, ఉత్పత్తి ఆలస్యం కావడంతో బోయింగ్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది. అమెరికాలో పని చేస్తున్న ఉద్యోగులు స్థానికత నిబంధనలకు అనుగుణంగా 60 రోజుల నోటీసు పీరియడ్‌కు అనుగుణంగా వచ్చే జనవరి వరకూ ఉద్యోగాల్లో కొనసాగుతారు.
సియాటెల్ ప్రాంతంలో 33 వేల మంది కార్మికులు కొన్ని వారాల పాటు సమ్మె చేయడంతో 737 మ్యాక్స్, 767, 777 జెట్ విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె వల్ల మూడో త్రైమాసికంలో 500 కోట్ల డాలర్ల నష్టం వాటిల్లిందని బోయింగ్ తెలిపింది. ఈ నష్టాలను పూడ్చుకోవడానికి ఉద్యోగులకు ఉద్వాసన తెలపడమే మార్గంగా భావిస్తున్నది. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల వల్ల ఇక పూర్తి ప్రాధాన్య అంశాలపైనే దృష్టి కేంద్రీకరించాలని నిర్ణయించామని బోయింగ్ పేర్కొంది. కష్టకాలంలో ఉద్యోగులకు అండగా ఉంటామని హామీ ఇచ్చింది.