Vikram Credit Card | బ్యాంక్ ఆఫ్ బరోడా అనుబంధ ‘బీవోబీ ఫైనాన్సియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎస్ఎల్)’ దేశంలోని భద్రతా సంస్థల సిబ్బంది, వివిధ దర్యాప్తు సంస్థల సిబ్బంది కోసం అద్భుతమైన ఆఫర్ తీసుకొచ్చింది. ‘విక్రమ్ క్రెడిట్ కార్డు’ పేరిట కొత్త క్రెడిట్ కార్డు డిజైన్ చేసింది. ఇది కేవలం భారత రక్షణ, పారా మిలిటరీ, పోలీసు జవాన్ల కోసమే తయారు చేసిన క్రెడిట్ కార్డ్ ఇది. సరిహద్దుల్లో దేశ భద్రత కోసం అవిశ్రాంతంగా సేవలందిస్తున్న సైనిక జవాన్ల కోసం భారత్ 74వ రిపబ్లిక్ డే వేడుకల సందర్భంగా ఈ క్రెడిట్ కార్డు తీసుకొచ్చామని బీఎఫ్ఎస్ఎల్ సోమవారం ఓ ప్రకటనలో వెల్లడించింది.
నిస్వార్థంగా దేశ రక్షణ బాధ్యతలతో జాతికి సేవలందిస్తున్న రక్షణ సిబ్బంది దైర్య సాహసాలకు గుర్తింపుగా, వారి రుణ పరపతి అవసరాలను తీర్చేందుకు ఈ క్రెడిట్ కార్డు అంకితం చేశామని బీఎఫ్ఎస్ఎల్ వివరించింది. ఇప్పటికే భారత సైనికుల కోసం ‘యోధ’, నౌకాదళ జవాన్ల కోసం ‘వరుణ’, కోస్ట్ గార్డ్ జవాన్లకు ‘రక్షమా’, అసోం రైఫిల్స్ కోసం ‘ది సెంటినెల్’ తదితర స్పెషల్ కో-బ్రాండెడ్ క్రెడిట్ కార్డులు అందిస్తున్నది.
ఈ విక్రమ్ క్రెడిట్ కార్డు లైఫ్ టైం ఫ్రీ ఆఫర్ అందిస్తున్నది. ఆకర్షణీయ రివార్డు పాయింట్లు, కాంప్లిమెంటరీ ఓటీటీ సబ్స్క్రిప్షన్ సౌకర్యం కల్పిస్తున్నది బీఎఫ్ఎస్ఎల్. దీనిపై రూ.20 లక్షల మేర ప్రమాద బీమా ఫెసిలిటీ అందిస్తున్నది. పెట్రోల్, డీజిల్ వినియోగంపై ఒకశాతం ఇంధన సర్ చార్జి లభిస్తుంది. పలు ఈఎంఐ ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. సీజనల్ మర్చంట్ ఆఫర్లు కూడా ఉంటాయి.
`అనిశ్చిత పరిస్థితుల నుంచి భారతీయులను రక్షించేందుకు అసాధారణమైన సేవలందిస్తున్న మన సాహసోపేతమైన సైనికులకు మేం విక్రం క్రెడిట్ కార్డు అంకితం చేశాం. 74వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తున్నాం. తెలివిగా మీ కుటుంబ పరమైన ఆర్థిక లావాదేవీల నిర్వహణకు, అత్యవసర పరిస్థితుల్లో వెసులుబాటు కోసం, ప్రతి కొనుగోలుపై పొదుపు ద్వారా విజయం సాధించేలా ఈ క్రెడిట్ కార్డు డిజైన్ చేశాం` అని బీఓబీ ఫైనాన్సియల్ సొల్యూషన్స్ లిమిటెడ్ ఎండీ కం సీఈవో శైలేంద్ర సింగ్ తెలిపారు.