BMW 50 Jahre M Edition | లగ్జరీ కార్ల తయారీ సంస్థ బీఎండబ్ల్యూ.. భారత్ మార్కెట్లోకి కొత్త స్పెషల్ ఎడిషన్ కారు ‘50 జాహ్రే ఎం ఎడిషన్’ తీసుకొచ్చింది. ఈ కారు మార్కెట్లో రూ.1.80 కోట్లుగా నిర్ణయించింది. బెస్ట్ సేఫ్టీ ఫీచర్లతో వస్తున్న ఈ స్పోర్ట్స్ స్పెషల్ ఎడిషన్ కారు కేవలం 3.3 సెకన్లలోనే 100 కిలోమీటర్ల స్పీడ్ అందుకుంటుంది. లిమిటెడ్ ఎడిషన్ కార్లు మాత్రమే ఉత్పత్తి చేసిన బీఎండబ్ల్యూ ఈ సెడాన్ వేరియంట్ ప్రీ-బుకింగ్స్ మొదలయ్యాయి. భారత్ మార్కెట్లోకి కేవలం పది యూనిట్లు మాత్రమే తీసుకొస్తున్నది బీఎండబ్ల్యూ.
‘50 జాహ్రే ఎం ఎడిషన్’ కారు బ్లూ, పర్పుల్, రెడ్ సెమీ సర్కిల్స్‌ను ఉపయోగించుకునే ‘50 జాహ్రే ఆఫ్ ఎం’ అనే బ్యాడ్జింగ్‌తో వస్తుంది. సాధారణ కారు కంటే ఈ కారు ధర రూ.6 లక్షలు ఎక్కువ. బీఎండబ్ల్యూ ఎం డివిజన్ ప్రారంభమై 50 ఏండ్లు పూర్తవుతున్న సందర్భంగా 50 జాహ్రే ఎం ఎడిషన్ అనే కారు తీసుకొస్తున్నది.
50 జహ్రే ఎం ఎడిషన్ కారులో ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, అటెన్టివ్నెస్ అసిస్టెన్స్, యాంటీ-లాక్ బ్రేకింగ్ సిస్టమ్(ఏబీఎస్) బ్రేక్ అసిస్ట్ తదితర సేఫ్టీ ఫీచర్లు జత చేశారు. డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ (డీఎస్సీ) సహా డైనమిక్ ట్రాక్షన్ కంట్రోల్ (డీటీసీ), ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ కంట్రోల్ (ఇడిఎల్సీ), కార్నరింగ్ బ్రేక్ కంట్రోల్ (సీబీసీ) వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. సరౌండ్ వ్యూ కెమెరాతో పార్కింగ్ అసిస్టెంట్ ప్లస్ కూడా అందిస్తున్నది.
ఇక తాజా 50 జాహ్రే ఎం ఎడిషన్ కారు.. ఎం ట్విన్ పవర్ టర్బో టెక్నాలజీ, 4.4 ఎల్ వీ8 ఇంజిన్‌తో వస్తున్నది. ఇంకా 625 బీహెచ్పీ టాప్ పవర్, 750 ఎన్ఎం గరిష్ట టార్చిని వెలువరిస్తుంది. ఇంజిన్ ప్యాడిల్ షిఫ్టర్లతో 8-స్పీడ్ ఎం స్టెప్ట్రానిక్ స్పోర్ట్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌తో అనుసంధానమై ఉంది. సెలూన్ రివర్సింగ్ అసిస్టెంట్ ఫీచర్ ఈ కారులో ప్రత్యేకత.
3డీ నావిగేషన్, 12.3 అంగుళాల ఫుల్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, 7.0 అడ్వాన్స్డ్ కాక్‌పిట్ కాన్సెప్ట్, బీఎండబ్ల్యూ లైవ్ కాక్‌పిట్ ప్రొఫెషనల్ తదితర ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి. బీఎండబ్ల్యూ వర్చువల్ అసిస్టెంట్, బీఎండబ్ల్యూ జెస్చర్ కంట్రోల్ & వైర్లెస్ ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటోతో కూడిన 12.3 – అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 16 స్పీకర్లతో కూడిన హర్మాన్ కార్డాన్ సరౌండ్ సౌండ్ సిస్టమ్ కూడా అందిస్తున్నది. బీఎండబ్ల్యూ లేజర్ లైట్, కిడ్నీ గ్రిల్‌ను కనెక్ట్ చేసే ఎల్-షేప్ లైట్ ట్యూబ్‌లకు డార్క్ టిన్టెడ్ యాక్సెంట్ యాడ్ అవుతుంది.
‘50 జహ్రే ఎం ఎడిషన్’ క్యాబిన్లో సీట్ బెల్ట్‌లు, ఎం ఫుట్‌రెస్ట్, పెడల్స్, ఎం లెదర్ స్టీరింగ్ వీల్, సీట్ హీటింగ్, మెమరీ ఫంక్షన్‌తో ఎలక్ట్రికల్ సీట్ అడ్జస్ట్మెంట్, ఆటోమేటిక్ టెయిల్‌గేట్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఆరు డిమ్మబుల్ లైట్లతో యాంబియంట్ లైటింగ్, కీ లెస్ ఎంట్రీ, ఆటోమేటిక్ లాకింగ్, టైల్ గేట్ కాంటాక్ట్ లెస్ ఓపెనింగ్ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.