Stocks | దేశీయ స్టాక్ మార్కెట్లపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘టారిఫ్’ల మోత మోగుతున్నది. ఇప్పటికే చైనా నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అదనంగా పది శాతం సుంకాలు విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ తాజాగా చేసిన ప్రకటన ఇన్వెస్టర్ల సెంటిమెంట్ బలహీన పడింది. అంతర్జాతీయ మార్కెట్లలో నష్టాలకు అనుగుణంగా ఫలితంగా దేశీయ ఈక్విటీ మార్కెట్లు నెత్తురోడాయి. బీఎస్ఈ-30 సెన్సెక్స్, ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ దాదాపు రెండు శాతం వరకూ నష్టపోయాయి.
బీఎస్ఈ-30 ఇండెక్స్ సెన్సెక్స్ 1,414.33 పాయింట్లు (1.90 శాతం) నష్టపోయి 73,198.10 పాయింట్ల వద్ద ముగిసింది. ఇంట్రాడే ట్రేడింగ్‌లో 1,471.16 పాయింట్లు (1.97 శాతం) పతనంతో 73,141.27 పాయింట్ల కనిష్టానికి పడిపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ-50 సూచీ నిఫ్టీ వరుసగా ఎనిమిదో రోజు నష్టాలను చవి చూసింది. ఎన్ఎస్ఈ సూచీ నిఫ్టీ ట్రేడింగ్ ముగిసే సమయానికి 420.35 పాయింట్లు (1.86 శాతం) నష్టపోయి 22,124.70 పాయింట్ల వద్ద స్థిర పడింది. గతేడాది సెప్టెంబర్ 27న జీవిత కాల గరిష్ట స్థాయి 85,978.25 పాయింట్లను తాకిన సెన్సెక్స్.. నాటి నుంచి ఇప్పటి వరకూ 12,780.15 పాయింట్లు (14.86శాతం) నష్టపోయింది. మరోవైపు ఎన్ఎస్ఈ సూచీ గత సెప్టెంబర్ 27న జీవిత కాల గరిష్టం 26,277.35 పాయింట్లకు చేరుకుంది. నాటి నుంచి ఇప్పటి వరకూ 4,152.65 పాయింట్లు (15.80 శాతం) నష్టపోయింది.
బీఎస్ఈ సెన్సెక్స్‌లో టెక్ మహీంద్రా ఆరు శాతానికి పైగా నష్టపోగా, ఇండస్ఇండ్ బ్యాంకు ఐదు శాతం పతనమైంది. మహీంద్రా అండ్ మహీంద్రా, భారతీ ఎయిర్ టెల్, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, టైటాన్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), నెస్లే, మారుతి సుజుకి స్టాక్స్ భారీగా పతనం అయ్యాయి. మరోవైపు హెచ్డీఎఫ్సీ బ్యాంకు మాత్రమే లాభాలతో ముగిసింది. ఆసియా మార్కెట్లలో సియోల్, టోక్యో, షాంఘై, హాంకాంగ్ భారీ నష్టాలతో సరిపెట్టుకున్నాయి. యూరోపియన్ యూనియన్ మార్కెట్లు పూర్తిగా నష్టాలతో ముగిశాయి. గురువారం వరకూ విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐ) రూ.556.56 కోట్ల విలువైన వాటాలు ఉపసంహరించారు. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడాయిల్ బ్యారెల్‌పై 0.69 శాతం తగ్గి 73.53 డాలర్లు పలుకుతుంది.