Blinkit : బ్లింకిట్, జెప్టో వంటి పలు క్విక్ కామర్స్, ఫుడ్ డెలివరీ సంస్థలు 10 మినట్ డెలివరీ సదుపాయాన్ని అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే, ఈ నిర్ణయంపై గిగ్ వర్కర్స్ (డెలివరీ ఏజెంట్లు) ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 10 నిమిషాల్లో డెలివరీ కోసం తీవ్రమైన ఒత్తిడిని ఎదుర్కొంటున్నామని చెప్పారు. ఈ అంశంపై ఇటీవల కేంద్రం కూడా స్పందించింది. 10 మినట్ డెలివరీ ఫీచర్ విషయంలో ఆలోచించాల్సిందిగా సూచించింది.
దీంతో కేంద్రం సూచన మేరకు బ్లింకిట్ దిగొచ్చింది. త్వరలోనే 10 మినట్ డెలివరీ సదుపాయాన్ని తొలగించనుంది. ప్రస్తుతం అనేక ఫుడ్ డెలివరీ, క్విక్ కామర్స్ వంటి సంస్థలు 10 మినట్ డెలివరీ ఫీచర్ ప్రవేశపెట్టాయి. దీని ప్రకారం.. ప్రతి ఉత్పత్తిని పది నిమిషాల్లో డెలివరీ చేసేందుకు డెలివరీ ఏజెంట్లు తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నారు. ఫిక్సుడ్ డెలివరీ టైం టార్గెట్ కూడా వారిని ఒత్తిడికి గురి చేస్తోంది. అలాగే వారికి ఇన్సూరెన్స్ వంటి సదుపాయాలు కూడా ఉండటం లేదు. ఈ అంశంపై దేశవ్యాప్తంగా గిగ్ వర్కర్స్ గత నెలలో ఆందోళన చేశారు. తమ సేవల్ని నిలిపివేశారు. ఈ నేపథ్యంలో కేంద్రం స్పందించింది. కేంద్ర కార్మిక శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయ స్పందించారు. జెప్టో, స్విగ్గీ, బ్లింకిట్, జొమాటో వంటి సంస్థల ప్రతినిధులతో చర్చించారు. గిగ్ వర్కర్స్ చేస్తున్న ఆందోళనను పరిగణనలోకి తీసుకోవాలని సూచించారు. గిగ్ వర్కర్స్ పై ఒత్తిడి పెంచొద్దని కంపెనీలను హెచ్చరించారు.
దీంతో ఈ అంశంపై బ్లింకిట్ ముందుగా స్పందించింది. త్వరలోనే ఈ సదుపాయాన్ని తొలగించనున్నట్లు తెలుస్తోంది. కంపెనీ బ్రాండింగ్, అడ్వర్టయిజ్ మెంట్, యాప్ లలో ఈ ఫీచర్ కనిపించదు. అలాగని, తాము ఇకపై స్లో డెలివరీ చేస్తామని కాదని కంపెనీ ప్రతినిధులు అంటున్నారు. మరోవైపు గిగ్ వర్కర్స్ రక్షణ, భద్రత, ఇతర ప్రయోజనాలకు సంబంధించి త్వరలో లేబర్ చట్టాలు మారే అవకాశం ఉంది. దీనిపై కంపెనీల ప్రతినిధులు, ప్రభుత్వం మధ్య చర్చలు జరుగుతున్నాయి.