Blinkit | దేశీయంగా క్విక్ కామర్స్ సేవలందిస్తున్న సంస్థ బ్లింకిట్ (Blinkit) తన సేవల విస్తరణ దిశగా అడుగేస్తున్నది. గురుగ్రామ్‌లోని సెలెక్టెడ్ ప్రాంతాల్లో 10-మినిట్స్ అంబులెన్స్ సర్వీస్ ప్రారంభించింది. గురుగ్రామ్‌లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టింది బ్లింకిట్. యూజర్లు తమకు అంబులెన్స్ సౌకర్యం అవసరమైతే బ్లింకిట్ యాప్‌లో అంబులెన్స్ కాల్ ఆప్షన్ ఎంచుకోవాలని ఓ ప్రకటనలో వెల్లడించింది.
‘ఆక్సిజన్ సిలిండర్లు, ఏఈడీ (ఆటోమేటెడ్ ఎక్స్ టర్నల్ డిఫిబ్రిల్లేటర్), స్ట్రెచర్, మానిటర్, సుషన్ మెషిన్, అత్యవసర ఔషధాలు, ఇంజెక్షన్లతోపాటు లైఫ్ సేవింగ్ ఎక్విప్ మెంట్స్‌తో అంబులెన్స్ సిద్ధంగా ఉంటుంది. స్కూప్ స్ట్రెచర్, సురక్షితంగా రోగులను తీసుకెళ్లేందుకు అవసరమైన వీల్ చైర్ ఉంటుంది’ అని తెలిపింది. ప్రతి అంబులెన్స్‌లోనూ పారా మెడిక్ సిబ్బంది, సుశిక్షుతులైన డ్రైవర్, డ్యూటీ అసిస్టెంట్ ఉంటారని పేర్కొంది. మున్ముందు మరిన్ని ప్రాంతాలకు సేవలు విస్తరిస్తామని వెల్లడించింది.
‘మన నగరాల పరిధిలో త్వరితగతిన నమ్మదగిన అంబులెన్స్ సేవలు అందిస్తాం. ఈ రోజు నుంచి గురుగ్రామ్‌లో ఆరు అంబులెన్స్‌లతో సేవలు ప్రారంభించాం’ అని బ్లింకిట్ సీఈఓ అల్బిందర్ ధిండ్సా ‘ఎక్స్ (మాజీ ట్విట్టర్)’ వేదికగా పోస్ట్ పెట్టారు. వచ్చే రెండేండ్లలో దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో అంబులెన్స్ సర్వీసులు అందించాలని మా లక్ష్యం అని తెలిపారు. తమకు లాభాలు ప్రధాన లక్ష్యం కాదు. దీర్ఘకాలంలో ప్రజలకు తక్కువ ఖర్చుతో కీలక సమస్యలు పరిష్కరించడమే లక్ష్యం’ అని ఆయన పేర్కొన్నారు.