Bitcoin | క్రిప్టో మేజర్ ‘బిట్ కాయిన్’ మంగళవారం ట్రేడింగ్లో మరో రికార్డ్ నమోదు చేసింది. యూఎస్ ఫెడ్ రిజర్వ్ త్వరలో వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న వార్తలు రావడంతో ఇన్వెస్టర్లు బిట్ కాయిన్ ఎక్స్చేంజ్ ట్రెడెడ్ ఫండ్స్ లో పెట్టుబడులు పెట్టారు. దీంతో బిట్ కాయిన్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.414 లక్షల కోట్ల డాలర్ల మార్కును చేరుకున్నది. సిల్వర్ (వెండి) విలువను దాటేసి బిట్ కాయిన్.. ప్రపంచంలోనే అత్యంత విలువైన ఆస్తుల్లో ఎనిమిదో స్థానాన్ని సంపాదించుకున్నది.
మంగళవారం ఇంట్రా డే ట్రేడింగ్ లో బిట్ కాయిన్ విలువ 72,850 డాలర్ల పై చిలుకు దాటింది. చివరకు మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు 72,160 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. దీంతో బిట్ కాయిన్ ఎం-క్యాప్ 1.414 లక్షల కోట్ల డాలర్లు. సిల్వర్ (వెండి) మార్కెట్ క్యాపిటలైజేషన్ విలువ 1.38 లక్షల కోట్ల డాలర్లు.
ఇప్పటికే సోషల్ మీడియా దిగ్గజం ‘మెటా’ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.23 లక్షల కోట్ల డాలర్ల మార్కును కూడా బిట్ కాయిన్ క్రాస్ చేసింది. తాజాగా సెర్చింజన్ గూగుల్ పేరెంట్ సంస్థ ఆల్ఫాబెట్ మార్కెట్ క్యాపిటలైజేషన్ 1.72 లక్షల కోట్ల డాలర్లకు చేరువలో ఉంది. ప్రపంచవ్యాప్తంగా బంగారం మార్కెట్ క్యాపిటలైజేషన్ 14.7 లక్షల కోట్ల డాలర్లతో కొందరు పోలుస్తున్నారు.