Bitcoin | అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ ఎన్నికవ్వడంతో క్రిప్టో కరెన్సీ మేజర్ బిట్‌కాయిన్ రికార్డుల్లో కొత్త పుంతలు తొక్కుతోంది. తొలిసారి 90 వేల డాలర్లకు చేరువలో వచ్చింది. సోమవారం ఉదయం ట్రేడింగ్‌లో 80 వేల డాలర్లు దాటిన బిట్‌కాయిన్ రాత్రికల్లా 89,100 డాలర్లకు చేరుకుందని కాయిన్ మెట్రిక్స్ తెలిపింది. సోమవారం ఒక్కరోజే 12 శాతం బిట్ కాయిన్ లాభ పడింది. ఇంట్రా డే ట్రేడింగ్‌లో బిట్ కాయిన్ 89,623 పాయింట్ల నుంచి 89,637 పాయింట్ల గరిష్టానికి దూసువెళ్లింది. భారత్ కరెన్సీలో ఒక బిట్ కాయిన్ విలువ సుమారు రూ.75 లక్షల పై చిలుకే. పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఈ ఏడాది చివరికల్లా లక్ష డాలర్లకు చేరుతుందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఎన్నికైనట్లు గత బుధవారం వెల్లడైనప్పటి నుంచి బిట్ కాయిన్, ఇతర క్రిప్టో కరెన్సీలు దూసుకెళ్తున్నాయి. గత బుధవారం నుంచి ఇప్పటి వరకూ బిట్ కాయిన్ విలువ 30 శాతం పై చిలుకు వృద్ధి చెందింది. మరోవైపు, త్వరలో యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తుందన్న సంకేతాలు కూడా బిట్ కాయిన్ విలువ పెరగడానికి కారణాలుగా తెలుస్తోంది. బిట్ కాయిన్ తోపాటు ఇతర క్రిప్టో కరెన్సీలకు రెగ్యులేటరీ వ్యవస్థను అమల్లోకి తెస్తామని ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో పేర్కొన్నారు.
బిట్ కాయిన్ తర్వాత స్థానంలో ఉన్న ఎథేర్ 5.8 శాతం, ఎక్స్ఆర్పీ నాలుగు శాతం, డోజికాయిన్ 38 శాతం, కాయిన్ బేస్ 3, మైక్రో స్టాటర్జీ ఐదు శాతం వృద్ధి చెందాయి. 2021 తర్వాత కాయిన్ బేస్ 19 శాతం వృద్ధి చెంది 300 డాలర్ల పైనే ట్రేడ్ అవుతుండటం ఇదే తొలిసారి. ఏడాది క్రితంతో పోలిస్తే ఆరుశాతం పెరిగింది కాయిన్ బేస్.