BIS Raid | అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వేర్‌హౌస్‌లపై బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) గురువారం భారీ దాడులు నిర్వహించింది. ఈ సందర్భంగా సరైన నాణ్యతా ధ్రువీకరణపత్రాలు లేని ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నది. మార్చి 19న మోహన్ కోఆపరేటివ్ ఇండస్ట్రియల్ ఏరియాలోని అమెజాన్ సెల్లర్స్ ప్రైవేట్ లిమిటెడ్ గిడ్డంగిలో ఈ దాడి 15 గంటల పాటు తనిఖీలు నిర్వహించింది. గీజర్లు, ఫుడ్ మిక్సర్లు సహా 3500పైగా ఎలక్ట్రిక్ ఉత్పత్తులను బీఐఎస్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ దాదాపు రూ.70లక్షలు. ఫ్లిప్‌కార్డ్ అనుబంధ సంస్థ ఇన్‌స్టాకార్ట్ సర్వీసెస్‌పై నిర్వహించిన దాడుల్లో అవసరమైన తయారీ గుర్తులు లేని 590 జతల స్పోర్ట్స్ ఫుట్‌వేర్‌ను స్వాధీనం చేసుకున్నామని.. వాటి విలువ రూ.6లక్షలుగా ఉంటుందని అధికారిక ప్రకటనలో బీఎస్ఐ పేర్కొంది.
నాణ్యత ప్రమాణాలు పాటించేలా దేశవ్యాప్తంగా చేపడుతున్న డ్రైవ్‌లో భాగంగా ఈ-కామర్స్ వేర్‌హౌస్‌లలో తనిఖీలు నిర్వహించినట్లు పేర్కొన్నారు. గత నెలలో ఢిల్లీ, గుర్గావ్, ఫరీదాబాద్, లక్నో, పెరంబుదూర్ సహా అనేక ప్రాంతాల్లో ఇదే తరహాలో దాడులు జరిగాయని పేర్కొంది. వినియోగదారుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఉత్పత్తి, నాణ్యత ప్రమాణాలను పర్యవేక్షించేందుకు ఈ దాడులు కీలకమైన ప్రకటనలో పేర్కొంది. ప్రస్తుతం 769 ఉత్పత్తి కేటగిరీలకు బీఐఎస్ నుంచి తప్పనిసరిగా ధ్రువీకరణ అవసరం. సరైన లైసెన్స్ లేకుండా ఈ వస్తువులను అమ్మడం, పంపిణీ చేస్తే చట్టపరంగా జరిమానా విధించనున్నది. 2016 బీఐఎస్ చట్టం ప్రకారం జైలు శిక్షతో పాటు జరిమానాలు విధించే అవకాశం ఉంది. అయితే, ఈ దాడులపై అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ ఇప్పటి వరకు స్పందించలేదు.