షుగర్ వ్యాధి వచ్చిందంటే చాలు ఇక జీవితం అయిపోయిందనే బాధ చాలామందిలో ఉంటుంది.
నిజానికి వయసు మీద పడుతున్నకొద్దీ అనారోగ్య సమస్యలు కూడా ఎక్కువవుతుంటాయి. అందులో
ఒకటే ఈ డయాబెటిస్. అదుపులో లేకుంటే దీనివల్లే జరిగే ప్రమాదం అంతాఇంతా కాదు.
మొదట్లో గుర్తిస్తే పర్వాలేదుగానీ ఆలస్యమై ఇప్పటికే కిడ్నీలపై ప్రభావం చూపితే మాత్రం ఆందోళన తప్పదు. అయితే ఈ వైద్య ఖర్చులకు బీమా లభించదా?, డయాబెటిక్ షేషెంట్లకు ఇన్సూరెన్స్ కంపెనీల భరోసా దొరకదా?, సాధారణ కంపెనీల వెయిటింగ్ పీరియడ్ వల్ల నిజంగా పేషెంట్లకు ప్రయోజనం ఉంటుందా?
మన దేశంలో సుమారు 8 కోట్లమంది డయాబెటిస్తో ఇబ్బందిపడుతున్నట్టు ఓ అంచనా. ప్రీ డయాబెటిక్ జనాలు వీళ్లలో లేరనే విషయాన్ని మనం గమనించాలి. ఈ వ్యాధి ఉందని గమనించని వాళ్ల సంఖ్య కూడా ఎక్కువే. ఒత్తిడి, జీవనశైలి, తిండి కారణాలతో ఈమధ్య యువత కూడా ఈ వ్యాధి బారినపడుతున్నారు. డయాబెటిస్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా జాబితాలో దక్షిణాది రాష్ర్టాలు ముందంజలో ఉండటం గమనార్హం. అందుకే ముందు జాగ్రత్తగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవడం మన ప్రథమ కర్తవ్యం. ఒకవేళ డయాబెటిస్, హైబీపీ వంటి సమస్యలున్నాసరే ఈమధ్య బీమా సంస్థలు ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి.
నాలుగేండ్ల వెయిటింగ్ పీరియడ్
ఒకవేళ డయాబెటిస్ గుర్తించిన తర్వాత సాధారణ హెల్త్ పాలసీని తీసుకోవాలని అనుకుంటే.. దానికి వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది. ముందుగా ఈ విషయాన్ని పాలసీ సంస్థకు తెలియజేయాలి. అప్పుడే సులువుగా క్లెయిం సాధ్యపడుతుంది. మామూలు ఆరోగ్య బీమా తీసుకున్నవాళ్లకు కనీసం నాలుగేండ్ల వెయిటింగ్ పీరియడ్ ఉంటుంది ఈ డయాబెటిక్స్ కవరేజీ రావడానికి. కానీ డయాబెటిస్ కోసమే పాలసీ తీసుకున్నవాళ్లకు మొదటిరోజు నుంచే కవరేజీ ఉంటుంది. ఇంకొన్ని కంపెనీలు గరిష్ఠంగా ఏడాది నుంచి రెండేండ్ల వెయిటింగ్ మాత్రమే పెడుతున్నాయి.
రిజెక్ట్ కూడా కావచ్చు
డయాబెటిస్ కారణంగా ఇప్పటికే కిడ్నీలు దెబ్బతిని ఉన్నా.. లేక ఇతర తీవ్ర సమస్యలు ఏవైనా ఉన్నా.. శరీర భాగాలు పూర్తిగా పాడైపోయినా కంపెనీలు పాలసీ కవరేజీని ఇవ్వడానికి నిరాకరిస్తాయి. అంతేకాదు టైప్-2 డయాబెటిస్‌కు అంత సులువుగా బీమా సౌకర్యాన్ని కల్పించవు.
మెడికల్ చెకప్స్ ఉంటాయా?
ఈమధ్య అధిక శాతం బీమా సంస్థలు హెల్త్ చెకప్స్ లేకుండానే పాలసీలు ఆఫర్ చేస్తున్నాయి. సెల్ఫ్ డిక్లరేషన్, తాజా డయాగ్నస్టిక్ రిపోర్ట్స్ ఆధారంగానే పాలసీల జారీ జరుగుతోంది. అయితే టెలీ మెడికల్ చెకప్లోనో, పాత రిపోర్టుల్లోనో ఏవైనా తీవ్రతమైన రుగ్మతలు బయటపడితే మెడికల్ చెకప్స్ ఉంటాయి. వాస్తవానికి రిస్క్ ప్రొఫైలింగ్ చేసుకున్న తర్వాత పాలసీ వస్తే.. కొనుగోలుదారుకు కూడా భరోసా ఉంటుంది.
ఏమేం జాగ్రత్తలు అవసరం ?
ప్రీమియం తక్కువగా ఉంది కదా అనే ఉద్దేశంతో పాలసీని ఎంపిక చేసుకోవద్దు. పాలసీ వర్డింగ్ తప్పనిసరిగా చదవండి. కో పే, రూమ్ రెంట్ లిమిట్స్, వెయిటింగ్ పీరియడ్ వంటి వాటిల్లో కాంప్రమైజ్ కావద్దు. కొన్ని సంస్థలు నో క్లెయిం బోనస్‌తోపాటు హెల్దీగా, ఫిట్‌గా ఉన్నవాళ్లకు డిస్కౌంట్లు కూడా ఆఫర్ చేస్తుంటాయి. ముఖ్యంగా ఔట్ పేషెంట్ కన్సల్టేషన్, మెడిసిన్ ఖర్చులు భరించే సంస్థకు తొలి ప్రాధాన్యత ఇవ్వండి. ఎందుకంటే డయాబెటిస్‌కు ఇన్‌పేషెంట్‌గా అడ్మిట్ కావడం కంటే నెలవారీ చెకప్‌లు, మందులకే ఎక్కువ ఖర్చవుతుంది. డే కేర్ వైద్యం, అంబులెన్స్ ఖర్చులు, పోస్ట్ హాస్పిటలైజేషన్ వ్యయాలు, దీర్ఘకాలం రెన్యూవల్ చేసుకునే సౌలభ్యం వంటి అంశాలను కూడా పాలసీని తీసుకునే ముందు మర్చిపోవద్దు.
-నాగేంద్ర సాయి కుందవరం
హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నాక వస్తే..
కొంతకాలం కిందటే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నవారికి ఇప్పుడు షుగర్, బీపీలు వస్తే వాటికి ఆటోమేటిగ్గా తక్షణ కవరేజీ లభిస్తుంది. అయితే తర్వాతి ఏడాది నుంచి ప్రీమియం లోడింగ్ ఉంటుంది. అలాకాకుండా డయాబెటిస్ గుర్తించిన తర్వాత పాలసీ కవరేజీ ఇవ్వడానికి కంపెనీలు కొద్దిగా తటపటాయిస్తాయి. అయితే న్యూ ఏజ్ బీమా సంస్థలు వెయిటింగ్ పీరియడ్ వంటివి లేకుండానే మొదటిరోజు నుంచే కవరేజీని అందిస్తున్నాయి. వీటి కోసం డయాబెటిక్ కేర్ అనే ప్రత్యేక పాలసీని రూపొందించాయి. ఇది సాధారణ పాలసీతో పోలిస్తే కాస్త భిన్నంగా ఉంటుంది. ముఖ్యంగా డయాబెటిక్ రోగుల కోసమే రూపొందించిన పాలసీలు కాబట్టి వాటి ఫీచర్స్ కూడా అలానే ఉంటాయి.
ఇంతకీ ప్రీమియం ఎంత?
సాధారణ ఆరోగ్య బీమా పాలసీతో పోలిస్తే స్పెషలైజ్డ్ వాటి ప్రీమియం ఎక్కువే ఉంటుందని ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. ఎందుకంటే డయాబెటిస్, హైబీపీ కారణంగా భవిష్యత్తులో హెల్త్ సమస్యలు వచ్చే ప్రమాదం అత్యధికం. అటువంటప్పుడు క్లెయిమ్స్ కూడా ఖచ్చితంగా ఎక్కువే ఉంటాయి. అందుకని ప్రీమియం ఎక్కువగా ఉంటుంది.
ఫ్రీడం ఫ్రమ్ డయాబెటిస్, ప్లాటినం ఎన్హెన్స్ డయాబెటిస్ సేఫ్, ప్రైమ్ యాక్టివ్ ఇలా రకరకాల పేర్లతో పాలసీలను కంపెనీలు ఆఫర్ చేస్తున్నాయి. 40 ఏండ్ల వ్యక్తికి రూ.5 లక్షల కవరేజీ కోసం ఏడాదికి కనిష్ఠంగా రూ.12 వేల నుంచి గరిష్ఠంగా రూ.18వేల వరకూ ప్రీమియం ఉన్నది.