న్యూఢిల్లీ, సెప్టెంబర్ 4: పలు ప్రభుత్వ రంగ సంస్థల్ని ప్రైవేటుకు అమ్మే డిజిన్వెస్ట్‌మెంట్ పథకంలో భాగంగా ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఐడీబీఐ బ్యాంక్ విక్రయ ప్రక్రియను వేగవంతం చేసింది. ఈ బ్యాంక్‌లో ఎల్సీఐతో కలిసి కేంద్రం వాటాను విక్రయించడానికి గతంలోనే ఆసక్తి వ్యక్తీకరణ బిడ్స్ (ఈవోఐ) కొన్ని ప్రైవేటు పార్టీల నుంచి అందాయి. ఈ బిడ్స్‌ను ప్రస్తుతం ప్రభుత్వం, రిజర్వ్బ్యాంక్లు పరిశీలిస్తున్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ను కొనదల్చిన బిడ్డర్లకు ప్రభుత్వం సెక్యూరిటీ క్లియరెన్స్‌ను, ఆర్బీఐ ‘ఫిట్ అండ్ ప్రోపర్’ క్లియరెన్స్‌ను ఇచ్చిన తర్వాత బిడ్డర్లు రెండోదశ బిడ్డింగ్ ప్రక్రియలో పాలుపంచుకుంటారు. ఏ రేటుకు బ్యాంక్‌ను కొనుగోలు చేసేదీ వారు ఫైనాన్షియల్ బిడ్స్‌లో తెలియపరుస్తారు. ఈ లోగా బ్యాంక్ ఆస్తుల విలువను లెక్కించేందుకు తాజాగా కేంద్రం, ఎల్ఐసీ తరపున డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్, పబ్లిక్ అసెట్ మేనేజ్మెంట్ (దీపం) సోమవారం అసెట్ వాల్యుయర్ సంస్థల నుంచి బిడ్స్ ఆహ్వానించింది.
అక్టోబర్ 9 చివరితేదీ
బిడ్స్ ద్వారా ఎంపికైన అసెట్ వాల్యూయర్ సంస్థ ఐడీబీఐ బ్యాంక్ ఆస్తులకు విలువకట్టడంతో పాటు ఈ వాటా విక్రయ లావాదేవీ పూర్తయ్యేంతవరకూ అవసరమైన సహకారం అందించాల్సి ఉంటుందని దీపం సోమవారం జారీచేసిన ఆర్ఎఫ్పీ (రిక్వస్ట్ ఫర్ ప్రపొజల్)లో తెలిపింది. ఇందుకు బిడ్స్ సమర్పించడానికి చివరితేదీ అక్టోబర్ 9. ఐడీబీఐ బ్యాంక్ పెట్టుబడుల విలువ (సబ్సిడరీలు, సహ సంస్థలు, జాయింట్ వెంచర్లలో పెట్టుబడులతో సహా), బ్యాంక్ ఇచ్చిన రుణాలు, అడ్వాన్సులు, స్థిరాస్తులు, ఇతర ఆస్తుల విలువను వాల్యుయర్ నిర్దేశించాలి. డిపాజిట్లు, బ్యాంక్ తీసుకున్న రుణాలు, ఇతర అప్పులు, కేటాయింపుల విలువను సైతం గణించాలని ఆర్ఎఫ్పీ పేర్కొంది. అసెట్ వాల్యూయర్ నియామకం మూడేండ్లు ఉంటుంది. అటుతర్వాత షరతుల మేరకు ఒక ఏడాది పొడిగించవచ్చు. ఐడీబీఐ బ్యాంక్ యాజమాన్య బదిలీతో పాటు వాటా విక్రయానికి ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ 2021 మే నెలలో ఆమోదం తెలిపింది.