ముంబై, ఆగస్టు 25 : దేశీయ బ్యాంకింగ్, ఆర్థిక సేవలు, బీమా (బీఎఫ్ఎస్ఐ) రంగాలు జోరు మీదున్నాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2025-26) ఈ రంగాల్లో నియామకాలు 8.7 శాతం వృద్ధి చెందవచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి మరి. ఈ క్రమంలోనే 2030కల్లా ఇది 10 శాతాన్ని తాకుతుందని, దీంతో దాదాపు 2.5 లక్షల శాశ్వత ఉద్యోగాల సృష్టి జరుగుతుందని వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ ప్రొవైడర్ అడెకో ఇండియా విడుదల చేసిన ఓ నివేదిక చెప్తున్నది. కాగా, ఇప్పటిదాకా మెట్రో నగరాల్లోనే బీఎఫ్ఎస్ఐ కంపెనీలు ఉద్యోగులను తీసుకోగా..
ఇకపై ద్వితీయ, తృతీయ శ్రేణి నగరాల్లోనూ ఉద్యోగ నియామకాలకు అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక్కడి నుంచే 48 శాతం కొత్త ఉద్యోగులు రావచ్చని అడెకో చెప్తున్నది. పట్టణాలు, ఓ మోస్తరు పట్టణాల్లోనూ సంప్రదాయ ఆస్తుల కంటే మార్కెట్ ఆధారిత సాధనాలైన యులిప్స్, మ్యూచువల్ ఫండ్స్, పెన్షన్ ప్రొడక్ట్స్‌పై ఆసక్తి పెరిగిందని.. అందుకే బీఎఫ్ఎస్ఐలు ఈ ప్రాంతాలపై దృష్టి పెడుతున్నాయంటున్నారు. దీంతో స్థానిక భాష, ఇతరత్రా అనుభవాలు ఉద్యోగార్థులకు కలిసిరానున్నాయి. జీతాల నిర్ణయంలోనూ ఇవి ప్రాధాన్యతాంశాలుగా ఉండనున్నాయని విశ్లేషిస్తున్నారు.