Car | నేడు కారు ప్రతి ఒక్కరికీ అవసరంగా మారుతున్నది. నిజంగా చెప్పాలంటే కారు కొనేందుకున్న అవకాశాలూ అందరికీ పెరిగిపోయాయిప్పుడు. చాలామంది ఆర్థిక స్థోమత బలపడటంతో కార్ల అమ్మకాలూ జోరుగా సాగుతున్నాయి. అయితే కారు అంటే ఖర్చుతో కూడుకున్న వ్యవహారమే. సొంతింటి తర్వాత చాలా మంది కల కారు కొనుగోలేననడంలో ఎలాంటి సందేహం లేదు. అందుకే కారు కొనుగోలులో తెలివిగా వ్యవహరించండి.
బడ్జెట్ వేసుకోవాలి
కారు కొనాలన్న ఆలోచన రాగానే ముందుగా బడ్జెట్ సెట్ చేసుకోండి. దీనివల్ల మీ కష్టార్జితం వృథా కాకుండా జాగ్రత్త పడవచ్చు. స్థోమతకు మించిన ఖర్చులకెళ్లడం లేనిపోని కష్టాలనే తెచ్చిపెడుతుంది. ఇక కారుకు చెల్లించే అధిక ధర.. బీమా, చెల్లించే వడ్డీలను ప్రభావితం చేయగలదని మర్చిపోవద్దు.
ఫీచర్లు చూడాలి
ఒకప్పుడు కారు అంటే.. కేవలం ప్రయాణ సాధనమే. కానీ ఇప్పుడు అంతకు మించేనని చెప్పవచ్చు. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా నేడు వస్తున్న కార్లలో ఎన్నో ఫీచర్లుంటున్నాయి. కాబట్టి రకరకాల కంపెనీలు తెస్తున్న కార్ల గురించి, వాటిలోని ఫీచర్ల గురించి పూర్తిగా తెలుసుకొని మార్కెట్లోకి అడుగు పెట్టండి. ఇందుకోసం సంప్రదాయ, ఆన్లైన్ వేదికలను వాడుకోండి.
టెస్ట్ డ్రైవ్ చేయాలి
మీరు ఎంచుకున్న బడ్జెట్లో వస్తున్న ప్రతీ కారునూ టెస్ట్ డ్రైవ్ చేయండి. అప్పుడే మీకు సౌకర్యవంతమైన వాహనాన్ని సొంతం చేసుకోగలరు. అంతేగాక టెస్ట్ డ్రైవ్‌లో రకరకాల రోడ్లపై కారు ఎలా ప్రయాణిస్తున్నది, లోపల కూర్చున్నవారికి ఎలా అనిపిస్తున్నది? అన్నదానిపైనా అవగాహన వస్తుంది. కారులోని లోపాలనూ గుర్తించవచ్చు.
ఫైనాన్స్‌కు వెళ్తే..
నేరుగా నగదు కంటే ఫైనాన్స్ ద్వారా కారు కొనేవారే ఎక్కువ. మీరూ ఆ దారిలోనే వెళ్లాలనుకుంటే ఏయే బ్యాంకుల్లో వాహన రుణాలపై ఎంతెంత వడ్డీరేట్లున్నాయి? ఇతర చార్జీల మాటేంటి అన్నది ఆరా తీయండి.
తొందరపడి..
కారును చూసో.. ఆయా సంస్థలు, డీలర్లిచ్చే ఆఫర్లకు ఆకర్షితులయ్యో.. ఎవరి బలవంతంతోనో.. కొనేందుకు బయలుదేరవద్దు. కుటుంబ సభ్యులతో చర్చించి, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకునే ఓ నిర్ణయానికి రావాలి. అప్పుడే ఎల్లవేళలా మీకు వారి మద్దతుంటుంది.
ఎక్కువ ఈఎంఐలు వద్దు
రుణ వాయిదాలను పెంచుకుంటే మీపై భారం తగ్గుతుందని డీలర్లు చెప్తే దాన్ని నమ్మవద్దు. ఎందుకంటే ఈఎంఐలు పెరిగితే మీపై వడ్డీ భారం పెరుగుతుంది. కాబట్టి ఈఎంఐ ఎక్కువైనా.. వీలైనంత త్వరగా రుణ విముక్తులయ్యేందుకే మొగ్గు చూపండి. డౌన్ పేమెంట్ ఎక్కువగా కడితే రిలీఫ్‌గా ఉంటుంది.
ఊ కొట్టొద్దు
చెప్పిన ధరకే కాకుండా డీలర్లతో ఇంకా రేటు తగ్గేదాకా సంప్రదింపులు జరుపండి. డాక్యుమెంటేషన్, డెస్టినేషన్ చార్జీలు, పన్నులు, ఇతరత్రా ఫీజుల గురించి తెలుసుకొని, వాటిని వీలైనంత వరకు దూరం చేసుకునేలా మాట్లాడండి. బెటర్ డీల్‌కు ప్రయత్నించండి. కారు కొన్న తర్వాత అదనపు యాక్ససరీస్ బిగించుకోవడంలోనూ జాగ్రత్త వహించి అవసరమైతేనే ముందుకెళ్లండి.
పాత కారు విషయంలో..
మీకు పాత కారు ఉంటే దాన్ని అమ్మే విషయంలో తొందరపడవద్దు. ఎక్కువ ధర వస్తున్నదని అమ్ముకుంటే.. కొత్త కారు విషయంలో ఏదైనా తేడా కొడితే అనవసరపు ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది.