ముంబై, అక్టోబర్ 26: రుణ రికవరీకి సంబంధించి రిజర్వు బ్యాంక్ కఠిన నిబంధనలను అమలు చేయడానికి సిద్ధమవుతున్నది. రుణాలు వసూలు చేయడానికి వెళ్లే రికవరీ ఏజెంట్లపై రిజర్వుబ్యాంక్ కఠిన షరతులు విధించింది. బకాయిల వసూళ్ళకు సంబంధించి ఉదయం 8 గంటలలోపు, సాయం త్రం 7 గంటల తర్వాత రుణ గ్రహీతలకు ఎట్టి పరిస్థితుల్లో కాల్ చేయవద్దని ఆదేశించింది. బ్యాంకులు, నాన్-బ్యాంకింగ్ సంస్థలు విధాన రూపకల్పన, కేవైసీ నిబంధనలు నిర్ణయించడం, రుణాల మంజూరుకు సంబంధించి ప్రధాన విధులను ఔట్సోర్స్ చేయకూడదని తన ముసాయిదాలో ఆర్బీఐ పేర్కొంది.
ఆర్థిక సేవల్లో ఔట్ సోర్సింగ్, ప్రవర్తన నియామవళికి సంబంధించిన ముసాయిదాను తీర్చిదిద్దింది. దీని ప్రకారం ఖాతాదారులతో మాట్లాడే విధానంపై రికవరీ ఏజెంట్లకు శిక్షణ కూడా ఇవ్వాలని సూచించింది. రుణ వసూలు విషయంలో నియంత్రిత సంస్థలుగానీ, రికవరీ ఏజెంట్లు గానీ వ్యక్తులను భౌతికంగా, మౌళికంగా బెదిరించడం, వేధించడం వంటి చేయకూదని తన ముసాయిదాలో పేర్కొంది. ఈ ముసాయిదాపై వచ్చే నెల 28 లోగా వాటాదారులు సూచనలు చేయవచ్చునని పేర్కొంది.