Banks Closed 4 Days | బ్యాంకుల్లో లావాదేవీలు, ఇతర పనుల కోసం వెళుతున్న వారు తమ శాఖలు తెరిచి ఉన్నాయా.. లేదా తెలుసుకోవాలని సూచిస్తున్నారు. శనివారం నుంచి మంగళవారం వరకు నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు. వారాంతపు సెలవులు, రెండు రోజుల పాటు బ్యాంకుల సిబ్బంది సమ్మె చేయనున్నారు. బ్యాంకుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈ నెల 28, 29 తేదీల్లో దేశంలోని అన్ని బ్యాంకుల సిబ్బంది సమ్మెలో పాల్గొనాలని బ్యాంకు ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి.
దేశవ్యాప్తంగా బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు వెళుతున్నట్లు భారతీయ బ్యాంకుల సంఘం (ఐబీఏ)కు బ్యాంకు ఉద్యోగుల సంఘాలు నోటీసు ఇచ్చాయి. నోటీసులు ఇచ్చిన సంఘాల్లో అఖిల భారత బ్యాంకు ఉద్యోగు సంఘం (ఏఐబీఈఏ), భారతీయ బ్యాంకు ఉద్యోగుల సమాఖ్య (బీఈఎఫ్ఐ), అఖిల భారత బ్యాంకు అధికారుల సంఘం (ఏఐబీఓఏ) ఉన్నాయి. అయితే, సమ్మె రోజుల్లో బ్యాంకు శాఖలు, కార్యాలయాల్లో సాధారణ సేవలకు ఆటంకం తలెత్తకుండా తప్పనిసరి చర్యలు తీసుకుంటున్నట్లు స్టాక్ ఎక్స్చేంజ్కిచ్చిన నోటీసులో ఎస్బీఐ తెలిపింది.
సమ్మె సమయంలో ఆన్లైన్ బ్యాంకింగ్ సేవలు అందుబాటులో ఉంటాయి. ఆన్లైన్లో నగదు లావాదేవీలు జరుపుకోవచ్చు. నాలుగు రోజులపాటు బ్యాంకులు మూసి ఉండటంతో ఏటీఎంల్లో నగదుకు కొరత ఏర్పడవచ్చునన్న సందేహాలు ఉన్నాయి.
ఆర్థిక సంవత్సరం ప్రారంభం అయ్యే ఏప్రిల్ నెలలో బ్యాంకులు 15 రోజులు పని చేయవు. దేశంలోని వివిధ ప్రాంతాలు, రాష్ట్రాల్లో వివిధ కారణాల రీత్యా 9 రోజులు బ్యాంకు సేవలు అందుబాటులో ఉండవు. నాలుగు ఆదివారాలు, రెండో శనివారం, నాలుగో శనివారం బ్యాంకులకు సెలవులు.. కనుక వచ్చే నెలలో 15 రోజులు బ్యాంకు సేవలు ఉండవు.