Face Recognition | మీరు నగదు విత్‌డ్రా చేయాలా.. అయితే ఫేషియల్ రికగ్నిషన్, ఐరిష్ స్కాన్ ఓకే అంటేనే దేశీయ బ్యాంకులు నగదు విత్ డ్రాయల్స్, డిపాజిట్లకు అనుమతి ఇవ్వనున్నాయి. అవును ఇది నిజం. వ్యక్తిగత లావాదేవీలు.. నిర్ధిష్ట వార్షిక పరిమితిని మించి ఆర్థిక లావాదేవీలు జరిపేందుకు వచ్చిన వ్యక్తులను గుర్తించడానికి బ్యాంకులు ఫేషియల్ రికగ్నిషన్, కొన్ని సందర్భాల్లో ఐరిష్ స్కాన్ చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని తెలుస్తున్నది.
ఒక వ్యక్తి ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.20 లక్షల (24,478.61 డాలర్లు) నగదు డిపాజిట్లు, విత్ డ్రాయల్స్ చేయొచ్చు.అంతకు మించి నగదు డిపాజిట్ చేసినా, విత్ డ్రాయల్ చేసినా సంబంధిత వ్యక్తుల గుర్తింపు కార్డులను ధృవీకరించాలని బ్యాంకులకు కేంద్రం సూచించినట్లు తెలుస్తున్నది. గుర్తింపు కార్డుగా ఆధార్ కార్డును షేర్ చేయొచ్చునని పేరు చెప్పడానికి ఇష్ట పడని ఇద్దరు కేంద్ర ప్రభుత్వ అధికారులు చెప్పారు. రూ.20 లక్షలు దాటిన డిపాజిట్లు/ నగదు విత్ డ్రాయల్స్‌కు ఆధార్ లేదా పాన్ కార్డు తప్పనిసరిగా సమర్పించాలని గతేడాది కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
మోసాలు, పన్ను ఎగవేతకు అడ్డుకట్ట వేసేందుకు బ్యాంకుల్లో ఈ చర్యలు తీసుకుంటున్నట్లు దీంతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తుల కథనం. ఇప్పటికే కొన్ని ప్రైవేట్, ప్రభుత్వ బ్యాంకులు ఈ `ఫేషియల్ రికగ్నిషన్, ఐరిష్ స్కాన్` ఆప్షన్ అమలు చేయడం ప్రారంభించాయని పేరు చెప్పడానికి ఇష్ట పడని ఓ బ్యాంకర్ చెప్పారు. `ఫేషియల్ రికగ్నిషన్, ఐరిష్ స్కాన్` ధృవీకరణ బహిరంగంగా చేయకూడదని బ్యాంకులకు జారీ చేసిన అడ్వైజరీలో కేంద్రం సూచించినట్లు సమాచారం. ఒక్కోసారి ఆయా బ్యాంకుల ఖాతాదారులు తమ పాన్ కార్డు సమర్పించకపోవచ్చు. అటువంటి సందర్భాల్లో మరో ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డు ఉపయోగిస్తే.. ఈ కొత్త వెరిఫికేషన్ తప్పనిసరి కాదని తెలుస్తున్నది.
ఖాతాదారుల ఫేషియల్ రికగ్నిషన్‌తో బ్యాంకులు తమ ఖాతాదారుల వెరిఫికేషన్ చేపట్టడంతో వారి వ్యక్తిగత గోప్యత దెబ్బ తింటుందని ప్రైవసీ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. `ప్రైవసీ, సైబర్ సెక్యూరిటీ, ఫేషియల్ రికగ్నిషన్‌పై స్పష్టమైన చట్టం లేకపోవడం వల్ల వ్యక్తిగత గోప్యత అంశం తలెత్తుతుంది` అని సైబర్ లా నిపుణులు, న్యాయవాదులు చెబుతున్నారు. ఈ కోణంలోనే త్వర (2023 ప్రారంభం)లో నూతన ప్రైవసీ లాకు పార్లమెంట్ ఆమోద ముద్ర పొందేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం తెలిపింది.
ప్రతి ఒక్కరి ఆధార్ కార్డుకు ఒక విశిష్ట ప్రాధికార నంబర్ ఉంటుంది. దాంతోపాటు సంబంధిత వ్యక్తి ఫింగర్ ప్రింట్స్, ఫేస్, ఐ స్కాన్ డేటా అనుసంధానమై ఉంటుంది. వ్యక్తిగతంగా ఖాతాదారుల ఫింగర్ ఫ్రింట్ ధృవీకరణ ఫెయిల్ అయితే, ఫేషియల్ రికగ్నిషన్, ఐరిష్ స్కాన్ డేటా ధృవీకరించుకోవడానికి వీలుగా పౌరుల డేటా తమకు షేర్ చేయాలని కోరుతూ విశిష్ట ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India (UIDAI)కు లేఖ రాయాలని బ్యాంకులను కేంద్ర ఆర్థికశాఖ గత నెలలోనే ఆదేశించింది.
ఫేషియల్ రికగ్నిషన్, ఐరిష్ స్కాన్ ధృవీకరణకు సంబంధిత ఖాతాదారుల సమ్మతి తప్పనిసరని యూఐడీఏఐ అధికార ప్రతినిధి చెప్పారు. అయితే, బ్యాంకుల్లో ఖాతాదారుల వెరిఫికేషన్‌కు ఫేషియల్ రికగ్నిషన్, ఐరిష్ స్కాన్‌కు అనుమతించిన విషయమై స్పందించడానికి కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ నిరాకరించింది.