FD’s Good for Senior Citizens | ఇన్వెస్ట్‌మెంట్‌కు, ఆదాయం పన్ను చట్టంలోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపుకు టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లు అత్యంత ప్రజాదరణ పొందిన ఆప్షన్లలో ఒకటి. అయితే ఫిక్స్డ్ డిపాజిట్‌పై ప్రతియేటా రూ.1.5 లక్షల వరకు పన్ను మినహాయింపు పొందొచ్చు. ఒక్క ఖాతాకు మాత్రమే అంటే ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ ఖాతాల్లో ఫిక్స్డ్ డిపాజిట్ చేసినా.. ఒక ఖాతాకు మాత్రమే పన్ను మినహాయింపు లభిస్తుంది. ఈ ఫిక్స్డ్ డిపాజిట్ పథకానికి ఐదేండ్ల లాకిన్ పీరియడ్ కూడా ఉంటుంది.
పన్ను మినహాయింపు డిపాజిట్ పథకాలైన ఫిక్స్డ్ డిపాజిట్లపై వచ్చే వడ్డీ ఆదాయం మీద మాత్రం పన్ను చెల్లించాల్సి ఉంటుంది. సాధారణ పౌరులు చేసిన ఫిక్స్డ్ డిపాజిట్లపై ఆదాయం రూ.40 వేల వరకు, సీనియర్ సిటిజన్లకు రూ.50 వేల వరకు పన్ను మినహాయింపు లభిస్తుంది. ఇంతకుమించి ఆదాయం లభిస్తే మాత్రం స్లాబ్‌ను బట్టి పన్ను చెల్లించాల్సిందే.
ఇటీవల పెరిగిన పోయిన నిత్యావసర వస్తువుల ధరల ప్రభావాన్ని కట్టడి చేయడానికి ఆర్బీఐ రెండు దఫాలుగా రెపోరేట్ 4.90 శాతానికి పెంచేసింది. ఈ తరుణంలో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పథకాలు.. ఇన్వెస్టర్లు మదుపు చేయడానికి గుడ్ ఆప్షన్‌గా మారనున్నాయి. ముందస్తు విత్‌డ్రాయల్స్ చేయకుండా ఐదేండ్లపాటు లాంగ్‌టర్మ్ డిపాజిట్ చేయడానికి సిద్ధమైన వారికి ఫిక్స్డ్ డిపాజిట్లు మంచి ఆప్షన్. సీనియర్ సిటిజన్లు టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై మూడు ప్రైవేట్ బ్యాంకులు 7.10 శాతం వడ్డీరేట్లు ఆఫర్ చేస్తున్నాయి. అవేంటో ఓ లుక్కేద్దాం..
డీసీబీ బ్యాంకులో పన్ను ఆదా ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో కనీసం రూ.1000, గరిష్ఠంగా రూ.1.50 లక్షలు డిపాజిట్ చేయాలి. ఐదేండ్లు, అంతకంటే ఎక్కువ కాలం టాక్స్ సేవర్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకాల్లో ఇన్వెస్టర్లు మదుపు చేయాలి. ఒకసారి నగదు జమ చేస్తే గైడ్‌లైన్స్ ప్రకారం గడువు ముగిసే వరకు విత్‌డ్రాయల్స్ చేయడానికి అనుమతించరు. గత నెల 21 నుంచి సీనియర్ సిటిజన్లు చేసే ఫిక్స్డ్ డిపాజిట్లపై 7.10 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నట్లు డీసీబీ బ్యాంక్ ప్రకటించింది. సాధారణ కస్టమర్లకు 6.60 శాతం వడ్డీరేటు మాత్రమే ఆఫర్ చేస్తున్నది.
మరో ప్రైవేట్ బ్యాంక్ యస్ బ్యాంక్ టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్ పథకంలో కనీసం రూ.1000, గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు డిపాజిట్ చేయొచ్చు. ఐదేండ్ల లాకిన్ పీరియడ్‌తోపాటు నామినేషన్ ఫెసిలిటీ కూడా అందుబాటులో ఉంది. స్థానిక శాఖ ద్వారా గానీ, ఫోన్ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా గానీ యెస్ బ్యాంక్ టాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు తెరిచేందుకు యెస్ బ్యాంక్ అనుమతి ఇస్తున్నది. సీనియర్ సిటిజన్లకు టాక్స్ సేవింగ్ ఫిక్స్డ్ డిపాజిట్లపై ఏడు శాతం, సాధారణ ఖాతాదారులకు 6.25 శాతం వడ్డీ ఆఫర్ చేస్తున్నది. ఈ నెల ఆరో తేదీ నుంచి పెరిగిన వడ్డీరేటు అమల్లోకి వచ్చింది. వడ్డీ ఆదాయం నెలవారీ, మూడు నెలలకోసారి చెల్లిస్తారు. బ్యాలెన్స్ అమౌంట్‌ను మెచ్యూరిటీ తర్వాత రీ ఇన్వెస్ట్ చేయొచ్చు.
ఆర్బీఎల్ బ్యాంకులో టాక్స్ సేవింగ్స్ ఫిక్స్డ్ డిపాజిట్ ఖాతాలు రూ.100 నుంచి రూ.1.50 లక్షల వరకు తెరవచొచ్చు. ఐదేండ్ల లాకిన్ పీరియడ్, నామినేషన్ ఆప్షన్ కూడా ఉంటుంది. ముందస్తుగా పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ నగదు విత్‌డ్రాయల్‌కు అనుమతించరు. జాయింట్ ఖాతాలు ఉంటే, ప్రైమరీ ఖాతాదారుడికి మాత్రమే ఆదాయంపన్ను చట్టం (ఐటీ)లోని 80సీ సెక్షన్ కింద పన్ను మినహాయింపు లభిస్తుంది. సీనియర్ సిటిజన్లకు 6.80 శాతం, సాధారణ కస్టమర్లకు 6.30 శాతం వడ్డీరేటు ఆఫర్ చేస్తున్నది. పెరిగిన వడ్డీరేట్లు ఈ నెల 8 నుంచి అమల్లోకి వచ్చాయి.