గోజారియా(గుజరాత్), ఆగస్టు 11 : బ్యాంకు ఖాతాల్లో కనీస నగదు నిల్వలపై రిజర్వు బ్యాంక్ గవర్నర్ సంజయ్ మల్హోత్రా స్పందించారు. మినిమమ్ బ్యాలెన్స్ ఎంత ఉండాలనేది పూర్తిగా బ్యాంకుల నిర్ణయమని, దీనిపై రిజర్వు బ్యాంక్ నియంత్రణ ఏదీ ఉండదని స్పష్టంచేశారు. కనీస బ్యాలెన్స్ పరిమితిని ఐసీఐసీఐ బ్యాంక్ గరిష్ఠంగా రూ.50 వేల వరకు పెంచిన సంగతి తెలిసిందే. దీనిపై విమర్శలు వ్యక్తమవుతున్న ప్రస్తుత తరుణంలో ఆయన పై విధంగా స్పందించారు. కనీస బ్యాలెన్స్ ఎంత ఉండాలనే నిర్ణయం ఆర్బీఐ బ్యాంకులకే వదిలేసింది.
కొన్ని బ్యాంకులు రూ.10 వేలు, మరికొన్ని బ్యాంకులు రూ.2 వేలుగా నిర్ణయిస్తుంటాయి. ఇటీవల ఐసీఐసీఐ బ్యాంక్ తన పొదుపు ఖాతాల్లో నగదు నిల్వలను ఐదింతలు పెంచుతూ నిర్ణయం తీసుకున్నది. దీంతో రూ.10 వేలుగా ఉన్న కనీస నగదు నిల్వలను రూ.50 వేలకు పెంచింది. కానీ, కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు కనీస నగదు నిల్వలపై పరిమితులను ఎత్తివేశాయి. యువతకు డిజిటల్ ఆర్థిక అక్షరాస్యత చాలా కీలకమన్నారు. మునుపు చదువుకోకపోతే అభివృద్ధి చెందరని చెప్పేవారు.. కానీ నేటి యుగంలో డిజిటల్ అక్షరాస్యత విషయంలోనూ ఇదే పరిస్థితి అన్నారు.